ఐపీఎస్, ఐఏఎస్ అధికారులపై బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి సీరియస్ కామెంట్లు చేశారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు దేశం పట్ల, ప్రజల పట్ల అంకిత భావంతో పని చేయాలన్నారు. ఓ రాజకీయ పార్టీకో.. పొలిటికల్ లీడర్లకు అధికారులు అనుకూలంగా ఉండకూడదని ఆమె వ్యాఖ్యానించారు. ఎన్నికల అధికారులుగా ఉన్న వాళ్లు బాధ్యతతో వ్యవహరించాలని, అధికారులు ప్రజల పట్ల బాధ్యతతో ఉండాలి కానీ.. పార్టీ పట్ల కాదనే విషయాన్ని అధికారులు గుర్తించాలన్నారు పురందేశ్వరి. తప్పులు చేసే అధికారులు తీరు మార్చుకోకుంటే కేంద్రానికి ఫిర్యాదులు చేస్తామని, ఏపీలో దొంగ ఓట్ల అంశం ఆందోళన కలిగిస్తోందన్నారు పురందేశ్వరి. ఇప్పటికే దొంగ ఓట్ల వ్యవహరం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని, మా ఫిర్యాదుతోనే ఐఏఎస్ అధికారి గిరీషా సహా ఇతర అధికారులను సస్పెండ్ చేశారని పురందేశ్వరి స్పష్టం చేశారు. వైసీపీ నేతలు – అధికారులు కుమ్మక్కై ఓటర్ల జాబితాలో అవకతవలు చేస్తున్నారని, క్రిమినల్ మైండ్ ఉన్న వాళ్లే ఇంత పెద్ద ఎత్తున ఓటర్ల జాబితాలో అవకతవకలు చేయగలరన్నారు. తక్కువ మార్జినులో వైసీపీ ఓడిపోయే చోట్ల వైసీపీ ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతున్నట్టు మాకు సమాచారం ఉందని, వలంటీర్లను పోలింగ్ ఏజెంట్లకు వాడుకుంటామని మంత్రి ధర్మాన చెబుతున్నారన్నారు పురందేశ్వరి.
వలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా వాడకూడదని సీఈసీ చెప్పిందని, వలంటీర్ల విషయంలో మంత్రి ధర్మాన కామెంట్లు ఆందోళన కలిగించే అంశమన్నారు. బీజేపీ ప్రజా సేవకు అంకితమైన పార్టీ అని పురందేశ్వరి అన్నారు. ప్రజా సేవ చేసి.. అధికారంలోకి రావాలనేది బీజేపీ ఉద్దేశమని, రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 370 సీట్లు వస్తాయని, 370 అనేది బీజేపీకి నంబర్ కాదు.. సెంటిమెంట్ అమె వ్యాఖ్యానించారు. వికసిత్ భారత్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుగుతోందని, పల్లెకు పోదాం అనే కార్యక్రమం ద్వారా పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేస్తున్నామన్నారు. మరో వైపు అన్ని నియోజకవర్గాలను కవర్ చేసేలా ప్రజా పోరు కార్యక్రమం చేపడుతున్నామని, కేంద్ర నిధులు ఆయా నియోజకవర్గాల్లో ఏ విధంగా అందుతున్నాయనే అంశాన్ని వివరిస్తున్నామన్నారు. అంతేకాకుండా.. పొత్తులపై పార్టీ అధిష్టానం చూసుకుంటుందని పురేందేశ్వరి స్పష్టం చేశారు. ఎన్ని సీట్లల్లో పోటీ చేస్తామనేది కూడా హైకమాండే నిర్ణయిస్తుందని, పార్టీ బలోపేతం పైనే మేం ఫోకస్ పెట్టామన్నారు. కార్యకర్తలు ఉత్సాహంగా పని చేస్తున్నారన్నారు.
