Telangana: ఆగస్టు 15 తర్వాత ఉద్యోగులకు డీఏ ప్రకటిస్తామని.. ఉపాధ్యాయ సమస్యలపై సంఘాలతో చర్చించిన అనంతరం ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి శుక్రవారం ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపారు. రైతు రుణ మాఫీ పూర్తైన వెంటనే ఆగస్టు 15 తర్వాత ఉపాధ్యాయ, ఉద్యోగులకు బకాయి ఉన్న డీఏ ప్రకటిస్తామని వెల్లడించారు. ఒకటా, రెండా అనేది ముఖ్యమంత్రి నిర్ణయిస్తారన్నారు. యూయస్పీసీ, జాక్టో ఆధ్వర్యంలో ప్రొఫెసర్ కోదండరాం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్‌మెంట్ కోరగా.. ముందుగా వేం నరేందర్ రెడ్డితో చర్చించమని సూచించారు. ఆమేరకు ఈరోజు యూయస్పీసీ, జాక్టో, టీటీజేఏసీ తదితర ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో నరేందర్ రెడ్డి చర్చలు జరిపారు.బదిలీలు, పదోన్నతులు సజావుగా నిర్వహించినందుకు ప్రభుత్వాన్ని సంఘాల నాయకులు ముందుగా అభినందించారు.
Read Also: Siddipet: నిరుపేద విద్యార్థికి కలెక్టర్ చేయూత.. ఐఐటీలో చేరేందుకు పేదరికం అడ్డురావద్దని సాయం
బదిలీలు, పదోన్నతుల్లో ఏర్పడిన సమస్యలపై అప్పీల్స్‌ను సత్వరమే పరిష్కరించాలని కోరగా.. పరిష్కరించమని అధికారులను ఆదేశిస్తామన్నారు. గత ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాల నాయకులపై పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలని అడగగా.. అప్పటికప్పుడే డీజీపీకి విషయం చెప్పి ఉపసంహరించమని కోరారు. అన్ని సంఘాలు చర్చించి ప్రాధాన్యతాక్రమంలో సమస్యల జాబితాను ఉమ్మడిగా రూపొందించి ఇస్తే మూడు జేఏసీల పక్షాన పరిమిత సంఖ్యలో ప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహించి సాధ్యాసాధ్యాలపై చర్చించిన తదుపరి ముఖ్యమంత్రితో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించుకుందామన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్పటానికి అపాయింట్ మెంట్ ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు 40 మంది పాల్గొన్నారు.