NTV Telugu Site icon

Cyclone Remal: బంగాళాఖాతంలో వాయుగుండం.. నేడు తీవ్ర తుపానుగా మారే అవకాశం

Cyclone Remal

Cyclone Remal

Cyclone Remal: పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం శుక్రవారం ఉదయం మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడింది. 24 గంటల్లో తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది ఈశాన్య దిశగా పయనిస్తూ శనివారం ఉదయం తుపానుగా, రాత్రికి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందుతుందని ఐఎండీ వెల్లడిచింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో బంగ్లాదేశ్‌లోని ఖేపుపరాకు దక్షిణ నైరుతి దిశలో 700 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్‌లోని సాగర్‌ ద్వీపానికి దక్షిణ ఆగ్నేయ దిశలో 660 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఖేపుపరా, సాగర్‌ ద్వీపం మధ్యలో తీరం దాటే అవకాశం ఉంది భారత వాతావరణ విభాగం తెలిపింది. ఈ తుపాన్‌కు ‘రేమాల్‌’గా పేరు పెట్టినట్లు వాతావరణ శాఖ అధికారి డాక్టర్ సునంద వెల్లడించారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌పై తుపాను తీవ్ర ప్రభావం చూపుతుందని వెల్లడించారు. మధ్య బంగాళాఖాతంలోకి మత్స్యకారులు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ రేమాల్‌ తుపాను ప్రభావం ఏపీపై ఉండదని.. అత్యధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని ఐఎండీ పేర్కొంది. తుపాను తీరం దాటే సమయంలో గరిష్ఠంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.

Read Also: Telangana MLC ByPoll: నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

తుపాను ప్రభావంతో నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని, రాబోయే 2 రోజుల్లో బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు శ్రీలంక వరకు విస్తరించినట్లు స్పష్టం చేసింది. ఏపీ వ్యాప్తంగా శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి డాక్టర్ సునంద తెలిపారు.