మొంథా తుఫాన్ ప్రభావంతో విశాఖ తీరం వెంబడి ఈదురు గాలులు బలంగా వీస్తున్నాయి. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. తుఫాన్ ప్రభావంతో విశాఖలో వర్షం మొదలైంది. మొంథా తుఫాను బలహీనపడి.. తీవ్ర అల్పపీడనంగా మారింది. రానున్న 24 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. తుఫాను ప్రభావం పూర్తిగా తొలిగేవరకు నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరికలుజారీ చేశారు.
మొంథా తుఫాను ప్రభావంతో అనకాపల్లి జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు అనకాపల్లిలో శారదా నది ఉదృతంగా ప్రవహిస్తోంది. జిల్లాకు భారీ వర్షాలు పడే సూచనలు చేయడంతో అనకాపల్లి నుండి వివిధ ప్రాంతాలకు వెళ్లే 62 బస్సు సర్వీసులను ఆర్టీసీ అధికారులు రద్దు చేశారు. తుఫాన్ కారణంగా నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని శివపురం, లింగాపురం మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. మొంథా తుఫాను ప్రభావంతో ఒంగోలు నగరంలో వెంకటేశ్వర కాలనీ ప్రాంతం నీట మునిగింది. కాలనీలోకి వెళ్లే రహదారులు మొత్తం జలమయం అయ్యాయి.
Also Read: Cyclone Montha: రైతులను నిండా ముంచేసిన మొంథా.. వేల ఎకరాలలో వరి పంట నాశనం!
తుఫాన్ ప్రభావం, పంట నష్టంపై ప్రభుత్వం దృష్టి పెడుతోంది. అధికారులు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పునరావాసం, ఆహారం, మందులు సరఫరా చేస్తున్నారు. విద్యుత్ పునరుద్ధరణ, చెట్లు తొలగింపుపై త్వరితగతిన చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. భారీ వర్షాలు కొన్ని జిల్లాల్లో కురుస్తుండడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. తుఫాన్ తీవ్రత, తాజా పరిస్థితులపై సీఎం చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది.
