Cyberabad: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆలయ ప్రాంగణంలో బాలికతో ఓ వృద్ధుడు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న విషయాన్ని స్థానికులు గుర్తించడంతో అసలు బండారం బయటపడింది.
స్థానికుల సమాచారం ప్రకారం.. ఆలయానికి బయట నుంచి తాళం వేసి ఉండగా, లోపల బాలికతో ఓ వ్యక్తి అనుచితంగా ప్రవర్తిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఆలయం వద్దకు చేరుకుని తలుపులు తెరిచి అతడిని పట్టుకున్నారు. ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తున్న సాయన్న అనే వృద్ధుడే ఈ ఘటనకు పాల్పడినట్లు స్థానికులు పేర్కొన్నారు.
ఘటనను గుర్తించిన గ్రామ పెద్దలు, స్థానికులు అతడిని పట్టుకుని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఘటనపై వివరాలు సేకరించారు. ఆ తర్వాత కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ఆలయ ప్రాంగణంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని కూడా స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయమై కూడా పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం.

