Cyber Fraud: సైబర్ నేరగాళ్ల కొత్త ట్రెండ్.. ప్రభుత్వ ఉద్యోగులే టార్గెట్ గా.!

Cyber

Cyber

Cyber Fraud: సైబర్ నేరగాళ్లు కొత్త ఆలోచనలతో రెచ్చిపోతున్నారు. ఈసారి ఏకంగా ఒక ప్రభుత్వ రెవెన్యూ అధికారిని టార్గెట్ చేసి.. లక్ష రూపాయలు కాజేశారు. తాజాగా చేర్యాల తహశీల్దార్ ఏసీబీ (ACB) కి చిక్కడంతో.. అక్కడి రెవెన్యూ అధికారులు తీవ్ర భయాందోళనల్లో ఉన్నారు. అధికారుల్లో ఉన్న ఈ భయాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ కేటుగాళ్లు తమ వ్యూహాన్ని అమలు చేశారు. మీపై కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయంటూ పలువురు అధికారులకు ఫోన్లు చేసి బెదిరించడం ప్రారంభించారు.

ఇదే తరహాలో చేర్యాల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (RI) కి సైబర్ నేరగాళ్ల నుండి ఫోన్ కాల్ వచ్చింది. మీపై కేసు నమోదు కాకుండా ఉండాలంటే వెంటనే లక్ష రూపాయలు పంపాలని వారు బెదిరించారు. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన ఆర్ఐ.. వారు చెప్పిన అకౌంట్‌కు వెంటనే లక్ష రూపాయలు బదిలీ చేశారు. డబ్బులు పంపిన తర్వాత అనుమానం వచ్చి మళ్లీ ఆ నంబర్‌కు ఫోన్ చేయగా.. అది స్విచ్ఛాఫ్ అని వచ్చింది. దాంతో తాను మోసపోయానని గ్రహించిన సదరు అధికారి, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ప్రభుత్వ అధికారులు కూడా ఇలాంటి తప్పుడు ఫోన్ కాల్స్ నమ్మి మోసపోవద్దని, ఏదైనా అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.