చార్‌ధామ్ యాత్రకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే యాత్రకు భక్తులు పోటెత్తారు. కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. చార్‌ధాయ్ యాత్ర ఈ నెల 10న ప్రారంభమైన విషయం తెలిసిందే. యాత్రకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 31 వరకు వీఐపీలు ఆలయాలకు రావొద్దని సూచించింది. చార్‌ధామ్‌కు వీఐపీ దర్శనాలను నిలిపివేస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాధా రాతురి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఆలయాల 50 మీటర్ల పరిధిలో ఎలాంటి వీడియోలు తీయడం గానీ, రీల్స్ చేయరాదని తెలిపారు.
READ MORE: Krishnamma OTT: ఎలాంటి ప్రకటన లేకుండా.. వారానికే ఓటీటీలోకి వచ్చేసిన ‘కృష్ణమ్మ’!
యాత్రలో ఇప్పటికే 11 మంది ప్రాణాలు కోల్పోయారు. గతంలో కంటే అధికంగా జనాలు పోటెత్తుతున్నారు. అందుకే యాత్రకు వెళ్లాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం స్పష్టంచేసింది. రద్దీ రవాణా సదుపాయాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రిజిస్ట్రేషన్ తేదీ కన్నా ముందుగా ప్రయాణం పెట్టుకోవద్దని భక్తులకు సూచించింది. ఈ వివరాలను సీనియర్ పోలీసు అధికారి అర్పణ్ యదువంశీ ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాధ రాటూరి మాట్లాడుతూ.. రిజిస్ట్రేషన్ చేయించుకోని భక్తులను యాత్రకు అనుమతించబోమని తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలను పంపిస్తున్నామని వెల్లడించారు. రిజిస్ట్రేషన్ చేయించుకోని వాహనాలకు కూడా అనుమతి ఉండదని స్పష్టం చేశారు. ఈ పవిత్ర పుణ్య క్షేత్రాలలో 200 మీటర్ల పరిధిలో మొబైల్ ఫోన్లను వాడేందుకు అనుమతి లేదని, చార్‌ధామ్ యాత్ర గురించి తప్పుదోవ పట్టించే వీడియోలు, రీల్స్ అప్‌లోడ్ చేసేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.