NTV Telugu Site icon

Ambati Rayudu: వైసీపీలోకి క్రికెటర్‌ అంబటి రాయుడు?

Ambati Rayudu

Ambati Rayudu

Ambati Rayudu: టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీలో చేరబోతున్నాడనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తాను రాజకీయాలలోకి రావాలనుకుంటున్నట్లు అంబటి రాయుడు ఇంతకు ముందే ప్రకటించాడు. ఇదిలా ఉండగా.. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఇవాళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి జగన్‌ క్యాంపు కార్యాలయంలో ఉన్న సమయంలో క్రికెటర్ అంబటి రాయుడు అక్కడికి వచ్చాడు. కొన్ని రోజుల కిందట సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపిస్తూ రాయుడు ట్వీట్ చేశాడు. జగన్ స్పీచ్ ను షేర్ చేసి గ్రేట్ స్పీచ్ ‌.. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు మీ మీద పూర్తి నమ్మకం, ఆత్మవిశ్వాసంతో ఉన్నారని రాయుడు ట్వీట్ చేశాడు. గతంలో శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టుకు జగన్ శంకుస్థాపన చేశారు. ఆ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఆ ప్రసంగాన్ని వైసీపీ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా… అంబటి రాయుడు దాన్ని రీట్వీట్ చేశాడు. అంతేకాదు… ‘మన ముఖ్యమంత్రి జగన్ గారి గొప్ప ప్రసంగం. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి మీ మీద నమ్మకం, విశ్వాసం ఉన్నాయి సార్’ అని కామెంట్ చేశాడు. దీంతో రాయుడు వైసీపీలో చేరుతున్నాడనే ప్రచారం ఊపందుకుంది. ఇదిలా ఉంటే క్యాంపు కార్యాలయానికి వచ్చి జగన్‌ను కలవడంతో ఊహాగానాలు ఇంకా ఎక్కువయ్యాయి.

Read Also: Weather: తీవ్ర తుఫానుగా మోచా.. తెలుగు రాష్ట్రాలపై ఎఫెక్ట్

తాను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్టు రాయుడు ఇంతకు ముందే ప్రకటించాడు. రాయుడిని బీఆర్ఎస్ లోకి తీసుకురావడానికి ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ప్రయత్నించినట్టు కూడా వార్తలు వచ్చాయి. గుంటూరు జిల్లాకు చెందిన రాయుడు కాపు సామాజికవర్గానికి చెందినవాడు. దీంతో ఆయన జనసేనలో కూడా చేరే అవకాశాలున్నాయని పలువురు భావించారు. టీడీపీలో చేరే అవకాశం ఉందంటూ ఒక పత్రికలో వార్త కూడా వచ్చింది. అయితే, ఇప్పుడు జగన్‌పై ప్రశంసలు కురిపించడంతో పాటు ముఖ్యమంత్రిని కలవడంతో ఆయన వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. మరి, ఏం జరగబోతోందో వేచి చూడాలి.