Site icon NTV Telugu

Credit Cards Usage: ఒక్క నెలలో రూ.లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డు లావాదేవీలు

Credit Cards

Credit Cards

మన దేశంలో క్రెడిట్ కార్డులను బీభత్సంగా వాడేస్తున్నారు. దీంతో ఒక్కనెలలోనే రూ.లక్ష కోట్లకు పైగా క్రెడిట్ కార్డు లావాదేవీలు జరిగాయి. కరోనా సంక్షోభం తర్వాత ఆర్థిక కార్యకలాపాలు గాడిలో పడ్డాయని చెప్పేందుకు ఈ గణాంకాలు ఉదాహరణ అని రిజర్వ్‌ బ్యాంక్‌ ఇండియా (ఆర్‌బీఐ) అభిప్రాయపడింది. మే నెలలో దేశంలో రూ.1.25 లక్షల కోట్ల క్రెడిట్ కార్డు లావాదేవీలను యూజర్లు నిర్వహించారని ఆర్‌బీఐ వెల్లడించింది. మే నెలలో 7.68 కోట్ల క్రెడిట్‌ కార్డు వినియోగదారులు ఆన్‌లైన్‌లో కొనుగోళ్ల కోసం రూ.71,429 కోట్లు చెల్లింపులు చేశారని తెలిపింది. అటు పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ మెషీన్ల వద్ద రూ.42,266 కోట్ల లావాదేవీలు జరిపినట్లు వివరించింది. దీంతో ఆఫ్‌లైన్ కంటే ఆన్‌లైన్‌లోనే క్రెడిట్ కార్డులు వాడేందుకు వినియోగదారులు మక్కువ చూపుతున్నారని ఆర్‌బీఐ అభిప్రాయపడింది.

Read Also: Social Media: సోషల్‌ మీడియానే నమ్ముకున్న భారతీయులు.. అవే నిజమని నమ్మేస్తున్నారు..!

ఏప్రిల్‌ నెలలో మాత్రం క్రెడిట్‌ కార్డు కస్టమర్లు ఆన్‌లైన్‌లో రూ.65,652 కోట్ల చెల్లింపులు చేయగా.. పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ మెషీన్ల వద్ద రూ.39,806 కోట్ల లావాదేవీలు చేసినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. సంఖ్యాపరంగా అత్యధిక క్రెడిట్‌ కార్డులను జారీ చేసిన బ్యాంకుల్లో హెచ్‌డీఎఫ్‌సీ 1.72 కోట్లతో ముందంజలో ఉంది. మే నాటికి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 1.41 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.33 కోట్ల క్రెడిట్ కార్డులను వినియోగదారులకు జారీ చేశాయి. మరోవైపు డెబిట్ కార్డుల ద్వారా ఏప్రిల్ నెలలో వినియోగదారులు ఆన్‌లైన్, పాయింట్ ఆఫ్ సేల్స్ మిషన్‌ల వద్ద రూ.65,957 కోట్ల లావాదేవీలు జరిపారు. మే నెలలో డెబిట్‌ కార్డులతో పాయింట్ ఆఫ్ సేల్స్ మిషన్‌ల ద్వారా రూ.44,305 కోట్లు, ఈ–కామర్స్‌ కోసం రూ.21,104 కోట్లను వినియోగదారులు ఖర్చు చేశారు.

Exit mobile version