NTV Telugu Site icon

V Srinivasa Rao: మోడీకి పదవిలో ఉండే అర్హత లేదు.. అవిశ్వాస తీర్మానానికి ఏపీ ఎంపీలు మద్దతివ్వాలి..

V Srinivasa Rao

V Srinivasa Rao

V Srinivasa Rao: నరేంద్ర మోడీ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి విపక్షాలు.. ఓటింగ్‌లో పాల్గొన్న సభ్యుల్లో సగానికిపైగా MPలు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేస్తే ప్రభుత్వం పడిపోతుంది. లేదంటే వీగిపోతుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రక్రియలో ఇదో కీలక ఘట్టం. విపక్ష కూటమి ఇండియాగా ఏర్పడిన తర్వాత ఇచ్చిన తాజా అవిశ్వాస తీర్మానంపై ఆసక్తి నెలకొంది. ఇక, ప్రస్తుతం లోక్‌సభలో సంఖ్యాపరంగా ఎన్డీయే కూటమి బలంగా ఉంది. కాకపోతే లోకసభ ఎన్నికలకు 8 నెలల ముందు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంతోపాటు.. మణిపూర్‌ హింస బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన పరిణామం కావడంతో వాడీవేడీ చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, అవిశ్వాస తీర్మానాన్నికి ఏపీ ఎంపీలు దూరంగా ఉండడంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు మండిపడుతున్నారు.

Read Also: CM KCR: హెలికాప్టర్‌ ద్వారా సహాయక చర్యలు చేపట్టండి.. అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం

నరేంద్ర మోడీపై బీఆర్ఎస్‌తో సహా అనేక పార్టీ లు అవిశ్వాస తీర్మానం పెట్టాయి.. కానీ, మన ఆంధ్రప్రదేశ్‌లోని ఎంపీలు 25 మంది మోడీకి మద్దతు ఇవ్వడం సిగ్గు చేటు అని మండిపడ్డారు శ్రీనివాసరావు.. ఏపీకే మోడీ తీవ్రమైన అన్యాయం చేశారు.. కానీ, అంతా బాగుందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పడానికి సిగ్గుందా? అంటూ ఫైర్‌ అయ్యారు.. బీజేపీ బీ టీమ్‌ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అని ఇప్పుడు నిర్ధారణ అయ్యిందన్న ఆయన.. టీడీపీ ఎంపీలు మౌనంగా ఉండి దోబూచులాడారని విరుచుకుపడ్డారు.. మణిపూర్ ఘటన చూసైనా మన ఎంపీలు మారలేదంటే వాళ్లకి మనసు ఉందా? అని నిలదీశారు. విశాఖ రైల్వే జోన్, పోలవరం, కేంద్రీయ విద్యాలయం హామీలు అమలు‌ చేయలేదన్నారు. ఇక, గంగవరం పోర్ట్ ను ఏపీ ప్రభుత్వం జాతీయం చేయాలన్న ఆయన.. మోడీకి ప్రధాని పదవిలో ఉండే అర్హత లేదు.. అవిశ్వాస తీర్మానానికి ఏపీ ఎంపీలు మద్దతు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.. ఏపీకి న్యాయం చేయాలని ఈనెల 31న రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు సీపీఎం ఏపీ కార్యదర్శి వి. శ్రీనివాసరావు.