NTV Telugu Site icon

Telangana Assembly Elections 2023: బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ను సీపీఎం, బీఎస్పీ టెన్షన్‌..! ఎవరికి ప్లస్‌..? ఎవరికి మైనస్‌..?

Telangana

Telangana

Telangana Assembly Elections 2023: తెలంగాణ ఎన్నికల్లో ఓట్ల చీలిక విషయంలో లెఫ్ట్‌ పార్టీలు కీలకంగా మారిపోయాయి.. ఈ ఎన్నికల్లో మొదట బీఆర్‌ఎస్‌తో వామపక్షాలకు పొత్తు ఉంటుందని భావించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌తో లెఫ్ట్‌ పార్టీలు కలుస్తాయనుకున్నారు. చివరికి కాంగ్రెస్‌ తో పొత్తు కుదిరి సీపీఐ కొత్తగూడెం సీటుతో సరిపెట్టుకుంది. సీపీఎం మాత్రం ఒంటరిగా కొన్ని చోట్ల పోటీ చేస్తోంది. అయితే సీపీఎం పోటీ చేస్తున్న నియోజకవర్గాల పరిస్థితేంటనే చర్చ ఇప్పుడు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల్లో బలంగానే జరుగుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో పరోక్షంగా కాంగ్రెస్ ఓటమికి కారణమవుతుందా? అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. ఖమ్మంలో పాలేరు, నల్గొండలో మిర్యాలగూడ సెగ్మెంట్లలో సీపీఎం ఎన్ని ఓట్లు చీలుస్తుంది? ఈ ఓట్లు కాంగ్రెస్ గెలుపోటముల్ని డిసైడ్‌ చేస్తాయా అనే చర్చ ఒకటి నడుస్తోంది.

పాలేరు నియోజకవర్గంలో కమ్యూనిస్టులకు బలమైన ఓటు బ్యాంకు ఉంది. ఇక్కడ నుంచి ఆ పార్టీ నేతలు గతంలో కొన్నిసార్లు అసెంబ్లీకి కూడా ప్రాతినిధ్యం వహించారు. ముఖ్యంగా ఖమ్మం రూరల్ మండలంలో లెఫ్ట్‌ పార్టీలకు ఓటు బ్యాంకు ఉంది. ఇప్పుడు పాలేరులో తమ్మినేని వీరభద్రం పోటీలో ఉండడంతో, ఖమ్మం రూరల్ మండలంతో పాటు నియోజకవర్గంలో ఉన్న సీపీఎం ఓటు బ్యాంకుని ఆయన చీల్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. త‌మ్మినేని ఎన్ని వేల ఓట్లు సాధిస్తారు? ఆ ఓట్లు ఎవరి గెలుపుకి గండికొడతాయి అనే అంశంపై ప్రధాన పార్టీల అభ్యర్థులు టెన్షన్‌ పడుతున్నారు.

సీపీఎం పోటీ చేస్తున్న 19 స్థానాల్లో ఎక్కువగా ఉమ్మడి ఖమ్మం, నల్గొండలోనే ఉన్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌, సీపీఐ కలిసి పోటీ చేస్తే, సీపీఎం ఒంటరిగా 26 స్థానాల్లో పోటీ చేసి 91వేల ఓట్లు సాధించింది. ఒక్క సీటు కూడా గెలవలేదు. సీపీఎం భద్రాచలంలో 14వేల 228, వైరాలో 11, 373, మిర్యాలగూడలో 11,221, ఇబ్రహీంపట్నంలో 9106, పాలేరులో 6,769 ఓట్లు సాధించింది. అప్పటికి ఇప్పటికి సీపీఎం పుంజుకోలేదు అనుకుంటే, అదే స్థాయి ఓట్లు ఇప్పుడు కూడా పడితే, దాదాపు పది స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్క పార్టీకి పడే పరిస్థితి ఉంటే అది వేరు. కానీ, వ్యతిరేక ఓటు చీలిపోతే అధికార పార్టీకి లాభిస్తుంది. ఈ లెక్కన చూసినపుడు సీపీఎం పోటీ చేస్తున్న స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థుల్లో టెన్షన్‌ కనిపిస్తోంది.

రాష్ట్రంలో రెండో మూడు సీట్లైనా గెలచుకోవడానికి ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాలని సీపీఎం చాలా ప్రయత్నించింది. కాని బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు ఆఖరు నిమిషంలో హ్యాండివ్వడంతో సీపీఎం ఒంటరిపోరుకే సిద్ధపడింది. ఇప్పుడు సీపీఎం బలహీనంగా ఉన్నా, కొన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీకి కనీసం మూడు వేల ఓట్లయినా ఉంటాయి. హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల్లో ఈ ఓట్ల చీలికతో ఏ పార్టీ విజయావకాశాలు, ఎన్ని చోట్ల దెబ్బతింటాయనే చర్చ.. ప్రధాన పార్టీ అభ్యర్థులకు ఆందోళన కలిగిస్తోంది. పాలేరులో తమ్మినేని పోటీలో ఉండటం పొంగులేటిని టెన్షన్‌ పెడుతుంటే, మిర్యాలగూడలో జూలకంటి రంగారెడ్డి బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయనకి పదకొండు వేల ఓట్లు పోలయ్యాయి. ఈసారి ఆయన ఎన్ని ఓట్లు చీలుస్తారనేది కీలకంగా మారింది. ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు మరోసారి పోటీ చేస్తుంటే, కాంగ్రెస్ నుంచి బత్తుల లక్ష్మారెడ్డి బరిలో ఉన్నారు. జూలకంటి రంగారెడ్డి ప్రధానంగా కార్మికులతో పాటు వ్యవసాయ కూలీల ఓట్లపైనే నమ్మకం పెట్టుకున్నారు. రంగారెడ్డి చీల్చే ఓట్లపైనే మిర్యాలగూడ ఫలితం ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఇదే జిల్లాలోని నకిరేకల్ నియోజకవర్గంలో సీపీఎం గతంలో ఎనిమిది సార్లు గెలిచింది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఆ పార్టీ నామమాత్రంగా తయారైంది. ప్రస్తుతం అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య, కాంగ్రెస్ నుంచి వేముల వీరేశం పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచినా మూడు నుంచి ఐదు వేల ఓట్ల మధ్యనే మెజార్టీ ఉంటుందని విశ్లేషణలు వస్తున్నాయి. దీంతో గెలుపోటములకు సీపీఎం అభ్యర్థి చినవెంకులు చీల్చే ఓట్లే కీలకం కానున్నాయి. అలాగే నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గంలో సీపీఎం అభ్యర్థిగా ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి పోటీలో ఉన్నారు. గతంలో సీపీఎంలో పనిచేసిన నేతలంతా ప్రస్తుతం అధికార పార్టీ చేరిపోయినా, సీపీఎంకి పడే ఓట్లు కీలకంగానే మారే ఛాన్సుంది.

మరోపక్క తెలంగాణ ఎన్నికల్లో 107 చోట్ల బీఎస్పీ బరిలో ఉంది. సిర్పూరులో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ గెలుపై ధీమాగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో నిర్మల్‌లో ఇంద్రకరణ్‌రెడ్డి, సిర్పూరులో కోనేరు కోనప్ప బీఎస్పీ అభ్యర్థులుగానే గెలిచి తర్వాత బీఆరెస్‌లో చేరారు. అయితే తెలంగాణలో దళిత బహుజనుల ఓట్లు భారీగానే ఉన్నాయి. వీటిలో బీఎస్పీ ఎన్ని ఓట్లు చీలుస్తుందనే అంశం కూడా ఆసక్తికరంగా మారింది. గెలుపోటములు ఎలా ఉన్నా, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి, ఓట్లను గణనీయంగా పెంచుకోవటమే లక్ష్యమని ప్రవీణ్‌ కుమార్‌ చెప్తున్నారు. ఈ లెక్కన నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు పడినా అవి ఇతర పార్టీల గెలుపోటములపై ప్రభావం చూపటం ఖాయంగా కనిపిస్తోంది. అటు కొత్తగూడెం నియోజకవర్గంలో జలగం వెంకట్రావు ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ నుండి పోటీ చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్‌-సీపీఐల ఉమ్మడి అభ్యర్తిగా కూనంనేని, బీఆర్ఎస్‌ నుండి వనమా వెంకటేశ్వర్రావు పోటీ చేస్తున్నారు. జలగం వెంకట్రావు తన గెలుపుపై ధీమాగా ఉన్నారు. ఇక్కడ ట్రయాంగిల్‌ వార్‌లో ఎవరి ఓట్లు ఎటు చీలతాయో తెలియని పరిస్థితి ఉంది. జలగం నిన్నటిదాకా అధికార పార్టీలోనే ఉండటంతో అధికార పార్టీ ఓట్లు చీలతాయనే టెన్షన్‌.. అధికార పార్టీపై ఉన్న వ్యతిరేక ఓట్లు, సీపీఐకి మళ్లుతాయనుకుంటే, వాటిలో కొన్ని జలగం చీల్చే ఛాన్సుందనే వాదన మధ్య ఇక్కడ అభ్యర్థుల్ల టెన్షన్‌ కనిపిస్తోంది.