CPI Narayana: ప్రధాని మోడీ వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. తెలంగాణకు లక్ష కోట్లు ఇచ్చామని మోడీ చెప్తున్నారని.. ఆయన అబ్బ సొత్తు ఇచ్చారా అని నారాయణ ప్రశ్నించారు. గంగమ్మ జాతరకు బలిచ్చే మేకను పోషించినట్టు రైల్వేని ఆధునికీకరిస్తున్నారని.. ఆ తర్వాత అవి అమ్మేస్తారని ఆయన ఆరోపించారు. బీఎస్ఎన్ఎల్ నిలబెట్టడానికి రూ.30 వేల కోట్లు ఇస్తే సరిపోయేదని.. కానీ ప్రైవేట్ కంపెనీకి 30 వేల కోట్లు ఇచ్చి బీఎస్ఎన్ఎల్‌ని దెబ్బతీశారని ఆరోపణలు చేశారు. మోడీ తన డిగ్రీ విషయంలో అబద్ధాలు చెప్పడం ఆయన అనైతికతకు నిదర్శనమని విమర్శలు గుప్పించారు.
Read Also: BRS Party: బీఆర్ఎస్ నుంచి జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సస్పెన్షన్
డిగ్రీ లేకున్నా ప్రధానమంత్రి కావచ్చు.. తప్పేముందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. మోడీ అవినీతిపరుల గురించి మాట్లాడుతున్నారని.. కానీ జేపీసీ ఎందుకు వేయరని ప్రశ్నించారు. చుట్టూ అవినీతిపరులను కూర్చోబెట్టుకొని ఇతరులపై అవినీతిపరులను నిందలు వేస్తున్నారు మోడీ అంటూ విమర్శించారు. మోడీ మాటలు వింటుంటే దేనితో నవ్వాలో అర్థం కావట్లేదని ఎద్దేవా చేశారు. అదానీ వ్యవహారంలో సుప్రీంకోర్టు జోక్యంతో అదానికే లబ్ధి చేకూరిందని నారాయణ తెలిపారు. మాయల పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు… మోడీ ఊపిరి అంతా అదానీ చేతిలో ఉందన్నారు. మోడీ అబద్దాలకోరు.. ప్రైవేటు వ్యాపారస్తులకు మద్దతుదారు అంటూ నారాయణ విమర్శించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని సీపీఐ స్వాగతిస్తోందన్నారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా తెలంగాణ ప్రభుత్వం తరపున కొనుగోలు చేయాలన్నారు. సీపీఐ తరపు పూర్తి మద్ధతు తెలుపుతున్నామన్నారు. కార్మిక రంగం వైపు నుంచి పార్టీగా పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తున్నామన్నారు.