కాళేశ్వరం ఎలా కుంగిపోయిందో బీఆర్‌ఎస్ పార్టీ పరిస్థితి అంతే అని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. బీఆర్‌ఎస్‌లో తెలంగాణ సెంటిమెంట్ లేదని, ఆ పార్టీ ఇప్పుడు నిలబడటమే కష్టంగా ఉందన్నారు. కమ్యూనిస్టులు ఉంటేనే ఇండియా కూటమికి బలం అని కూనంనేని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీతో తమ స్నేహం కొనసాగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. ఎప్పటికైనా కమ్యూనిస్టులు ఏకం కావాలని, రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు.
సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ… ‘ప్రజపంథా ఆధ్వర్యంలో విప్లవ పార్టీలు ఏకం కావడం శుభపరిణామం. మనం కూడా అదే ధోరణిలో వెళ్లాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీతో స్నేహం కొనసాగుతుంది. కాళేశ్వరం ఎలా కుంగిపోయిందో బీఆర్‌ఎస్ పార్టీ పరిస్థితి అంతే.. బీఆర్‌ఎస్‌లో తెలంగాణ సెంటిమెంట్ లేదు. బీఆర్‌ఎస్ ఇప్పుడు నిలబడటమే కష్టంగా ఉంది. నల్గొండ, ఖమ్మం, పెద్దపల్లి, భువనగిరి, వరంగల్ స్థానాలు కావాలని ఆడిగాం. కనీసం ఒక్కటన్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. కమ్యూనిస్టులు ఉంటేనే ఇండియా కూటమికి బలం’ అని అన్నారు.
Also Read: Revanth Reddy: కేంద్ర ప్రభుత్వంతో మా ప్రభుత్వం వైరుధ్యం పెట్టుకోదు: రేవంత్ రెడ్డి
‘కేజ్రీవాల్ లాంటి వ్యక్తులను బెదిరించి తమ వైపు తిప్పుకోవాలని కుట్ర చేస్తున్నారు.ఇండియా కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. ఎవరు ఔనన్నా, కాదన్నా ఖమ్మం కమ్యూనిస్టుల ఖిల్లా. ఓట్లు తక్కువ వచ్చాయని సీపీఎంను తక్కువ అంచనా వేయలేం. ఉభయులం కలిసే ప్రయనిస్తాం. ఎప్పటికైనా కమ్యూనిస్టులు ఏకం కావాలి. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మన సత్తా చాటాలి’ అని కూనంనేని పేర్కొన్నారు.