Site icon NTV Telugu

Haryana-Punjab: శంభు సరిహద్దును వారంలోపు తెరవాలని కోర్టు ఆదేశం..

Haryana Punjab

Haryana Punjab

కేంద్ర ప్రవేశ పెట్టిన నూతన రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ.. ఫిబ్రవరి 10, 2024న.. కొన్ని రైతు సంఘాలు ఢిల్లీకి మార్చ్‌ని ప్రకటించాయి. దీంతో హర్యానా ప్రభుత్వం పంజాబ్ మరియు హర్యానాలోని శంభు సరిహద్దును బారికేడ్ల సహాయంతో మూసివేసింది. రైతులను హర్యానా సరిహద్దులో పోలీసులు అడ్డుకున్నారు. అప్పటి నుంచి ఆ సరిహద్దు మూతపడి ఉంది. కాగా.. ఈ సరిహద్దును తెరవాలని చాలా మంది కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. తాజాగా హర్యానా-పంజాబ్ హైకోర్టు ఈ సరిహద్దుపై తన తీర్పును ఇచ్చింది. శంభు సరిహద్దును వారంలోపు తెరవాలని పేర్కొంది. శంభు సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను 7 రోజుల్లోగా తొలగించాలని హర్యానా ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

READ MORE: Minister PRO committed suicide: మంత్రి పీఆర్వో ఆత్మహత్య.. కారణం ఇదే..

సరిహద్దుపై దాఖలైన పిటిషనర్ల తరఫు న్యాయవాది వాసు రంజన్ శాండిల్య మీడియాతో మాట్లాడుతూ.. చాలా కాలం క్రితమే సరిహద్దును తెరవాలని తమ తరపున పిటిషన్‌ దాఖలయ్యిందన్నారు. అందులో మూసివేతకు కారణమేమిటని పేర్కొన్నారు. శంభు సరిహద్దు కావడంతో అంబాలా వ్యాపారులు తీవ్ర నష్టాలను చవిచూశారని.. పస్తులుండే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఈ కోర్టు తీర్పుతో పంజాబ్, హర్యానా, హిమాచల్, జమ్మూ కాశ్మీర్ వ్యాపారులకు మళ్లీ కొత్త జీవితం లభించినట్లయ్యిందని వెల్లడించారు. “గతంతో పోలిస్తే పరిస్థితి చాలా మారిపోయింది. ఇప్పుడు ఆందోళనకారుల సంఖ్య కూడా తగ్గింది. పోలీసులతో పాటు, లా అండ్ ఆర్డర్‌ను కాపాడాలి. రైతులను కూడా కాపాడాల్సిన అవసరం ఉంది.” అని కోర్టు పోలీసు శాఖను ఆదేశించింది. పంజాబ్ మరియు హర్యానా కూడా శాంతిభద్రతలను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించింది.

Exit mobile version