ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ ఫీవర్ తారాస్థాయికి చేరుకుంది. కీలక నేతల ప్రచారానికి రంగం సిద్ధమైంది. పార్టీల అధ్యక్షులంతా జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మే 13న జరుగనున్న ఎన్నికల కోసం ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కించనున్నారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి జనం మద్ధతు కోరబోతున్నారు. ఈ క్రమంలో రేపటి (బుధవారం) నుంచి అధికార వైసీపీ పార్టీ.. బస్సుయాత్ర మొదలు పెట్టనుంది. కాగా.. రేపు ఇడుపులపాయ నుంచి సీఎం జగన్ బస్సుయాత్ర ప్రారంభం కానుంది. ‘మేమంతా సిద్ధం’ పేరుతో సీఎం జగన్ జనంలోకి వెళ్లబోతున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు యాత్ర సాగనుంది. ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గంలో వైసీపీ ఒక సభ నిర్వహించనుంది. అంతేకాకుండా.. ఆ రోజంతా ఆ నియోజకవర్గనేతలతో సమావేశం నిర్వహించనున్నారు. అలాగే.. స్థానిక ప్రజలు, మేధావులతో సీఎం జగన్ సమావేశం కానున్నారు.
సీఎం జగన్ రేపు ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయల్దేరి మధ్యాహ్నం ఒంటిగంటకు ఇడుపులపాయకు చేరుకుంటారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి దగ్గర నివాళులు అర్పించనున్నారు. ఆ తర్వాత 1.30 గంటలకు ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్రలో భాగంగా సీఎం జగన్.. ఇడుపులపాయ నుంచి కుమారునిపల్లి, వేంపల్లి, సర్వరాజుపేట, వీరపునాయనిపల్లి (కమలాపురం), గంగిరెడ్డిపల్లి, ఊరుటూరు, యర్రగుంట్ల (జమ్మలమడుగు), పొట్లదుర్తి మీదుగా సాయంత్రం 4.30 గంటలకి ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డుకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొంటారు. ఆ తర్వాత.. సున్నపురాళ్లపల్లి, దువ్వూరు, జిల్లెల, నాగలపాడు, బోధనం, రాంపల్లె క్రాస్, చాగలమర్రి మీదుగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ బైపాస్ రోడ్డులో రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.
Read Also: Kerala BJP: “మతం పేరుతో ప్రచారం”.. కేరళ సీఎంపై ఈసీకి బీజేపీ లేఖ..
మరోవైపు.. రేపట్నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ప్రజాగళం పేరుతో సభలు, సమావేశాలు, రోడ్ షోలతో ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఇప్పటికే తన సొంత నియోజకవర్గం కుప్పంలో ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహిస్తున్నారు. రేపటి నుంచి చంద్రబాబు ప్రజాగళం ప్రచారం కూడా రాయలసీమ నుంచి ప్రారంభం కానుంది. ఈనెల 31 వరకు చంద్రబాబు ప్రచార షెడ్యూ్ల్ ఖరారు అయింది. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు సాగేలా ప్రణాళికలు రూపొందించారు. కాగా.. 27న
పలమనేరు, నగరి, మదనపల్లె సెగ్మెంట్లల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. 28న రాప్తాడు, శింగనమల, కదిరి.. 29న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు.. 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లురుపేట, శ్రీకాళహస్తిలో ప్రచారం నిర్వహించనున్నారు. 31న కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో పర్యటించనున్నారు.
Read Also: Chandrababu: ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక మెగా డీఎస్సీ.. యవతతో సమావేశంలో చంద్రబాబు
అలాగే.. ఈ నెల 30వ తేదీ నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ జనంలోకి వెళ్లబోతున్నారు. తాను పోటీ చేయబోయే పిఠాపురం నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. మూడు రోజుల పాటు పిఠాపురంలో ఉండనున్నారు జనసేనాని. 30 నుంచి మూడు రోజుల పాటు పిఠాపురంలోనే పవన్ పర్యటన సాగనుంది. కాగా.. ఆరోజు నియోజకవర్గ నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు. 31న ఉప్పాడ సెంటర్ లో బహిరంగ సభలో పవన్ పాల్గొననున్నారు. ఏప్రిల్ 1న పిఠాపురంలో జనసేన, టీడీపీ, బీజేపీ లీడర్లు, కేడరుతో సమావేశం కానున్నారు. పిఠాపురం పర్యటన తర్వాత పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనలు చేపట్టే అవకాశం ఉంది.