Farmers Protest: వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగంపల్లి నరసింహ కాటన్ మిల్లులో పత్తి రైతులు ఆందోళన చేపట్టారు. పత్తి కొనుగోలు చేయకుండా కాటన్ మిల్ యాజమాన్యం నిలిపివేయడంతో రైతులు ఆందోళనకు దిగారు. పత్తి జిన్నింగ్ మిల్‌లో టెక్నికల్ సాంకేతిక లోపం రావడంతో పాటు తేమ శాతం ఎక్కువగా ఉండడంతో సీసీఐ నిబంధనల మేరకు పత్తి కొనుగోలు నిలిపివేసినట్లు పత్తి రైతులకు కాటన్ మిల్లు యాజమాన్యం తెలిపింది. హైదరాబాద్-బీజాపూర్ నేషనల్ హైవే రోడ్డుపై బైఠాయించి పత్తి రైతులు నిరసన తెలిపారు.
Read Also: MLC Botsa Satyanarayana: సిట్ రిపోర్ట్‌ను బహిర్గతం చేయాలి.. కేంద్రానికి లేఖ రాస్తానన్న బొత్స
పత్తి రైతులు ధర్నా చేపట్టడంతో కిలోమీటర్ల మేర అటు పరిగి, హైదరాబాద్ ఇటు కొడంగల్, బీజాపూర్ రోడ్డులో భారీగా వాహనాలు నిలిచిపోగా.. ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. గ్రామాల నుంచి ట్రాక్టర్లలో పత్తిని తీసుకొని వస్తే కొనుగోలు చేయకపోవడంతో ఆందోళనకు దిగినట్టు రైతులు తెలిపారు. పోలీసుల రంగ ప్రవేశంతో ధర్నా సద్దుమణిగింది. కాటన్ మిల్ యజమాన్యంతో మాట్లాడి ఇప్పుడున్న వారి ట్రాక్టర్‌లలోని పత్తి లోడ్లు దింపుకొని పంపించాలని పోలీసులు కోరారు. ఇరువైపులా నిలిచిపోయిన వాహనాలను క్లియర్ చేసి పోలీసులు పంపించారు. ఈ ఒక్కరోజుకు పోలీసులు, రైతుల రిక్వెస్టు మేరకు తిరిగి కొనుగోలు చేస్తున్నట్లు కాటన్ మిల్లు యాజమాన్యం ప్రకటించింది. రేపటి నుంచి వేరేచోటకు వెళ్లాలని పత్తి రైతులకు కాటన్ మిల్లు యాజమాన్యం సూచించింది.