ఆగస్టు వెళ్లిపోతోంది. అందరి చూపు కరోనా థర్డ్ వేవ్ మీదే ఉంది. ఎందుకంటే, సెప్టెంబర్, లేదంటే అక్టోబర్‌లో …ఎప్పుడైన థర్డ్ వేవ్ తడాఖా చూపొచ్చని ఇప్పటికే నిపుణులు హెచ్చరించారు. అయితే దీని ప్రభావం సెకండ్ వేవ్ అంత తీవ్రంగా ఉండకపోవచ్చని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మీడియా రిసెర్చ్ -ICMR తాజాగా ప్రకటించింది.
కరోనా థర్డ్ వేవ్ దేశం అంతటా ఒకేలా ఉంటుందని ఎవరూ చెప్పలేరని మెడికల్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. రాష్ట్రాలు ఉన్నట్టుండి ఆంక్షలు ఎత్తివేసినా, నిబంధనలకు నీళ్లొదిలేసినా థర్డ్ వేవ్ డేంజర్‌గా మారుతుందని హెచ్చరిస్తున్నారు. కేసులు కూడా భారీగా పెరుగుతాయని అంటున్నారు. ఐతే, కేవలం ప్రభత్వాలే కాదు ప్రజలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అప్రమత్తంగా ఉండి ..తగిన ముందస్తు జాగ్రత్తలు పాటించాలి. అప్పుడు మాత్రమే థర్డ్ వేవ్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు.
అసలు కరోనా వేవ్ ఎందుకు వస్తుందంటే.. మనలో సహజసిద్ధంగా ఉండే రోగ నిరోధక శక్తి , అలాగే టీకా ద్వారా వచ్చే యాంటీ బాడీస్ క్షీణించటం వల్ల. సెకండ్ వేవ్‌లో కరోనా వ్యాప్తి తక్కువగా ఉన్న చోట్లలో ఈసారి కేసులు పెరగొచ్చు. అలాగే అధిక సంక్రమణ రేటు ఉన్న జిల్లాల్లో ఈ సారి కేసులు ఆ స్థాయిలో ఉండవని భావిస్తున్నారు.
మరోవైపు, దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత కొన్ని రోజుల నుంచి తీవ్రత క్రమంగా పెరుగతోంది. నిత్యం 40వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇది ఆందోళన కలిగించే విషయం. కొత్తగా 42 వేల 909 కొత్త కేసులు వెలుగు చూశాయి. అయితే ఈ మొత్తం కేసులలో దాదాపు ముప్పాతిక శాతం ఒక్క కేరళ నుంచే కావటం మరింత ఆందోళన కరం. అక్కడ తాజాగా 29,836 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో నమోదైన మొత్తం కొత్త కేసుల్లో 69.5శాతం ఒక్క ఈ రాష్ట్రంలోనే బయటపడ్డాయి.
విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారు త్వరలో ఓ గుడ్‌న్యూస్ వినబోతున్నారు. కరోనా టెస్టు ఫలితాన్ని కొవిన్ యాప్ కు జత చేయాలని కేంద్రం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని నేషనల్ హెల్త్ అథారిటీ ప్రకటించింది. దీనివల్ల సదరు వ్యక్తి భారత ప్రభుత్వం ఆమోదించిన కరోనా టెస్టు చేయించుకున్నట్లు స్పష్టం అవుతుంది. ICMRతో కలిసి దీనిని అమలు చేయనున్నారు. విదేశీ ప్రయాణానికి వెళ్లే వారు 72 నుంచి 96 గంటలలోపు RT-PCR టెస్ట్ చేయించుకోవాలన్నది నిబంధన. అయినా ఇలా కొవిన్ యాప్‌ను వ్యాక్సిన్ పాస్‌పోర్టుగా విదేశాలు అంగీకరిస్తాయా అన్నది ప్రశ్న. అయితే దీనిపై వివిధ దేశాలతో మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది.