మహారాష్ట్ర ఎస్పీ అధ్యక్షుడు అబూ అజ్మీ.. మొఘల్ చక్రవరి ఔరంగజేబ్ గొప్ప పాలకుడని, క్రూరుడు కాదని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. వివాదం ముదరడంతో సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అబు అజ్మి క్షమాపణ చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, ఇందువల్ల ఎవరి మనోభావాలైనా గాయపడి ఉంటే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారు. చరిత్రకారులు, రచయితలు ఔరంగజేబ్ రహ్మతుల్లా అలి గురించి ఏమి చెప్పారో అదే తానూ చెప్పానని వివరణ ఇచ్చారు.
అబూ అజ్మీ క్షమాపణలు చెప్పిన ప్రజల కోపం ఆగడం లేదు. ఆ ప్రకటన తర్వాత.. పలువురు హిందువులు, సాధువులు ఔరంగజేబు సమాధిని బుల్డోజర్‌తో కూల్చేశాయాలని డిమాండ్ చేస్తున్నారు. మహారాష్ట్ర ఛత్రపతి సంభాజీ నగర్ నగరంలోని శివాజీ చౌక్ వద్ద ఔరంగజేబు సమాధిని తొలగించాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. ఔరంగజేబు లాంటి క్రూరమైన పాలకుడి సమాధి తొలగించనంత వరకు హిందువులు మౌనంగా కూర్చోరని చెబుతున్నారు.
ఈ సమాధిని తొలగించడానికి ఇప్పుడు ఒక సామూహిక ఉద్యమం జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. “ఔరంగజేబు భారతదేశానికి శత్రువు. అతను భారతదేశాన్ని దోచుకుని తీసుకెళ్లాడు. అతను ఒక క్రూరమైన ఆక్రమణదారుడు. మరి ఆయన సమాధి మహారాష్ట్రలోనే ఎందుకు ఉండాలి? దానిని ఛత్రపతి శంభాజీ మహారాజ్ జిల్లా నుంచి తొలగించాలి. ప్రభుత్వం మాకు అనుమతి ఇస్తే, మేము దానిని పెరికివేసి పారవేస్తాం.” అంటూ పలువురు హిందువు, సంఘాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మరోవైపు.. ఈ వివాదంపై ఎంపీ ఉదయన్‌రాజే భోసలే స్పందించారు. “ఔరంగజేబు సమాధిని ఉంచాల్సిన అవసరం ఏమిటి?” అని ప్రశ్నించారు.
తాజాగా ఓ మీడియా సంస్థ సమాధి వద్దకు చేరుకుంది. ఖుల్తాబాదు చేరుకుని, స్థానిక ముస్లిం పౌరుల నుంచి ఈ విషయం గురించి వారు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నించింది. నమాజ్ చేయడానికి వచ్చిన చాలా మంది కెమెరాను చూసిన వెంటనే మాట్లాడటానికి నిరాకరించారు. మాట్లాడిన వారు ప్రభుత్వాన్ని, రాజకీయ నాయకులను తిట్టారు. ఇది ఒక రాజకీయ స్టంట్ అని ప్రజలు అంటున్నారు. మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. దీని కారణంగానే ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఔరంగజేబు సమాధిని ఎవరూ తొలగించలేరని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమాధి 314 సంవత్సరాలుగా ఇక్కడ ఉందని.. ఇక్కడ ఉండటం ఈ స్థలానికి గర్వకారణమని చెబుతున్నారు. సమాధి తొలగింపును డిమాండ్ చేస్తున్న వారందరూ రాజకీయ నాయకులే, వారికి సామాన్య ప్రజలతో సంబంధం లేదని చెప్పారు.