NTV Telugu Site icon

RBI: రూ.535 కోట్ల నగదుతో రోడ్డుపై నిలిచిపోయిన కంటైనర్.. ఆ తర్వాత ఏమైందంటే?

Container

Container

RBI: రెండు కంటైనర్ ట్రక్కులు, చెన్నైలోని రిజర్వ్ బ్యాంక్ నుంచి విల్లుపురంకు రూ. 1,070 కోట్ల నగదును తీసుకువెళుతున్నాయి. ఒక్కోదాంట్లో రూ.535 కోట్లు ఉన్నాయి. ట్రక్కులలో ఒకటి సాంకేతిక లోపంతో చెన్నైలోని తాంబరంలో ఆగవలసి వచ్చింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో డ్రైవర్ జాతీయ రహదారిపై నిలిపివేశాడు. దీంతో రెండో ట్రక్కు కూడా అక్కడే ఆగింది. ఆ రెండు ట్రక్కుల్లో రూ.1,070 కోట్లు ఉండటంతో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. జాతీయ రహదారిపై 17 మంది పోలీసులు ట్రక్కులకు ఎస్కార్ట్‌గా ఉన్నారు.

Read Also: Karnataka CM: కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య.. ఏకైక డిప్యూటీ సీఎంగా డీకేఎస్.. పార్టీ అధికారిక ప్రకటన

రూ.535 కోట్ల నగదుతో వెళ్తున్న ట్రక్కు చెడిపోయిందని తెలుసుకున్న క్రోంపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, మరింత రక్షణ కోసం పోలీసులను పిలిచారు. జిల్లాలోని బ్యాంకులకు కరెన్సీని అందించేందుకు రెండు లారీలు చెన్నైలోని ఆర్‌బీఐ కార్యాలయం నుంచి విల్లుపురం బయలుదేరినట్లు తెలిసింది. ట్రక్కులలో ఒకటి చెడిపోవడంతో, భద్రతా కారణాల దృష్ట్యా దానిని చెన్నైలోని తాంబరంలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సిద్ధాకు తరలించారు. తాంబరం అసిస్టెంట్‌ కమిషనర్‌ శ్రీనివాసన్‌ బృందంతో సంఘటనా స్థలానికి చేరుకుని చెడిపోయిన లారీని గుర్తించారు. ట్రక్కును సిద్ధా ఇన్‌స్టిట్యూట్‌కు తరలించి, గేట్లను మూసివేశారు. ఇన్‌స్టిట్యూట్‌లోకి ప్రవేశించడం కొంతకాలం నిషేధించబడింది. మెకానిక్‌లు ట్రక్కును రిపేరు చేయలేకపోవడంతో చెన్నైలోని రిజర్వ్ బ్యాంక్‌కు తిరిగి పంపించారు.