Komatireddy Venkat Reddy : తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ విజయ పరంపర కొనసాగుతుందని, ఇకపై ప్రతిపక్షాలకు ఎలాంటి అవకాశం ఉండదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాదులోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (CPL) సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ పనితీరు, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల భూమికపై సుదీర్ఘంగా చర్చ జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ, “దేశంలో మొట్టమొదటిసారిగా కులగణనను చేపట్టి కాంగ్రెస్ చరిత్ర సృష్టించింది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికి దిశా నిర్దేశం చేస్తోంది. రాబోయే ఏ ఎన్నికలు జరిగినా, కాంగ్రెస్ పార్టీ 100% విజయం సాధించడం ఖాయం. కేవలం ప్రస్తుతం మాత్రమే కాదు, వచ్చే 30 ఏళ్ల పాటు తెలంగాణలో కాంగ్రెస్ పాలనే కొనసాగుతుంది” అని ధీమాగా ప్రకటించారు. తెలంగాణలో ప్రతిపక్షాలకు ఎలాంటి అవకాశం లేదని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. గత పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఏం చేయలేకపోయిందని ఆరోపించారు. ఇప్పుడేమో, సోషల్ మీడియాలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయడంలో చురుకుగా వ్యవహరిస్తోందని, అందుకే ప్రతిపక్షాలు అప్రచార యంత్రాంగాన్ని ఉపయోగిస్తున్నాయని అన్నారు.
Minister Seethakka : దేశంలో ఏ రాష్ట్రం కులగణన చేయలేదు.. మనమే కులగణన చేసి చూపెట్టినం
ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలందరికీ కొన్ని సూచనలు చేశారని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. ముఖ్యంగా, ప్రతి ఎమ్మెల్యే రోజూ ప్రజల మధ్యే ఉండాలని, ప్రజాసమస్యలు పరిష్కరించేందుకు నిరంతరం సిద్ధంగా ఉండాలని రేవంత్ రెడ్డి సూచించారని వెల్లడించారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలవడం చాలా మంది నేతలకు సాధ్యమవుతుందని, అయితే అదే స్థానంలో నిలదొక్కుకోవడం అసలైన సవాలని పేర్కొన్నారు. ప్రజలతో మమేకం కాకపోతే, వారికోసం పని చేయకపోతే, తిరిగి గెలవడం కష్టమని స్పష్టం చేశారు.
కొంతకాలంగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అవుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే, ఈ ఆరోపణలను కొట్టి పారేస్తూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. “ఒకే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కలసి భోజనం చేసినా అది తప్పేనా? దీనికీ రాజకీయ రంగు అద్దడం ఎంతవరకు సమంజసం? ప్రతిపక్షాలు ప్రజలకు పనికొచ్చే విమర్శలు చేయాలి. నిరాధార ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూడకూడదు” అని హితవు పలికారు. కులగణనపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తిప్పికొట్టారు. “కులగణన సర్వేలో పాల్గొనని వారు, దీనిపై మాట్లాడటం హాస్యాస్పదం. మేము సమగ్ర గణనను చేపట్టి చరిత్ర సృష్టించాం. ఇది దేశానికి ఆదర్శంగా నిలిచే కార్యక్రమం” అని స్పష్టం చేశారు.
MLA Anirudh Reddy : సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యే అనిరుధ్ సంచలన వ్యాఖ్యలు.. అందరూ షాక్..!