Site icon NTV Telugu

Congress Presidential Poll: ముగిసిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌.. గెలిచేది ఆయనేనట!

Congress President

Congress President

Congress Presidential Poll: 137 ఏళ్ల చరిత్రలో కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక కోసం ఎన్నికలు నిర్వహించడం ఇది ఆరోసారి. 24 సంవత్సరాల అనంతరం తొలిసారిగా గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తి కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలు ఉత్కంఠ రేపాయి. ఉదయం 10 గంటలకు దేశవ్యాప్తంగా ప్రారంభమైన ఎన్నికలు సాయంత్రం 4గంటలకు ముగిశాయి. సరిగ్గా 4 గంటలకు ఓటింగ్‌ ప్రక్రియ ముగిసింది. దేశవ్యాప్తంగా సగటున 96 శాతం ఓటింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో 87 మంది డెలిగేట్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ బూత్‌తో పాటు ఛండీగఢ్‌లో 100 శాతం ఓటింగ్ నమోదైంది.

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పీసీసీ కార్యాలయాల్లో, ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో పోలింగ్ జరిగింది. భారత్ జోడో యాత్ర క్యాంప్‌లో కూడా పోలింగ్​కు ఏర్పాట్లు చేశారు.ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో, దేశవ్యాప్తంగా 65 పోలింగ్ బూత్‌లలో ఓటింగ్ జరిగింది. నేడు పోలింగ్ జరుగగా.. ఈ నెల 19న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. లెక్కింపులో బ్యాలెట్లు అన్నీ కలిసిపోయి ఉంటాయి. కౌంటింగ్‌లో చెల్లని ఓట్లను పక్క పెడతారు. ఎవరికైతే 50 శాతం కన్నా ఎక్కువ ఓట్లు వస్తాయో వారిని విజేతగా ప్రకటిస్తారు. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘం ఛైర్మన్ మధుసూదన్ మిస్త్రీ విజేతను ప్రకటించనున్నారు.

ఈ అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌లో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఓటు వేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక నేపథ్యంలో.. నేడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు విరామం ఇచ్చారు. రాహుల్ గాంధీ కర్ణాటకలోని భారత్ జోడో యాత్ర క్యాంప్‌సైట్‌లో ఓటు వేశారు. పీసీసీ ప్రతినిధులైన 40 మంది కూడా అక్కడే ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే కర్ణాటకలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Komatireddy Venkat Reddy: రేవంత్ రెడ్డికి కౌంటర్.. ఎస్పీ రేంజ్ నేతలున్నప్పుడు, హోంగార్డు ఎందుకు?

ఎన్నికలు ప్రశాంతంగా ముగియగా.. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెలకొంది. అధ్యక్ష ఎన్నికల బరిలో సీనియర్లు మల్లికార్జున ఖర్గే, శశిథరూర్‌లు బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. వీరిద్దరు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. పీసీసీ ప్రతినిధుల మెప్పు పొందే ప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గే ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్కువ మంది సీనియర్లు ఆయనకే మద్దతునిచ్చినట్లు సమాచారం. ఈ విషయంలో శశిథరూర్‌ ఆరోపణలు గుప్పించినా.. తాము తటస్థంగా ఉన్నామని గాంధీ కుటుంబం స్పష్టం చేసింది.

ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. సీనియర్ల మద్దతు ఎక్కువగా ఉన్న మల్లికార్జున ఖర్గే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొదటి నుంచి గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్న ఖర్గేకు వివాదరహితుడు అనే పేరు కూడా ఉంది. దళిత వర్గానికి చెందిన నేత కావడం ఆయన కలిసొచ్చే అంశం. అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న శశిథరూర్‌ కాంగ్రెస్‌లో ఉన్న తెలివైన నాయకుల్లో ఒకరు. అంతర్జాతీయ గుర్తింపు ఉన్న అతికొద్ది కాంగ్రెస్ నాయకులు థరూర్‌ ముందుంటారు. కాంగ్రెస్ అధిష్ఠానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ లేఖ రాసిన జీ23 బృందంలో ఆయన ఒకరు కాగా.. ఇది ఆయనకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో ఖర్గే విజయం తథ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు.

Exit mobile version