Site icon NTV Telugu

Congress Presidential Poll: రేపే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు.. ఖర్గే వర్సెస్ థరూర్‌.. గెలుపెవరిది?

Congress

Congress

Congress Presidential Poll: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు సోమవారం జరగనున్నాయి. పార్టీ అధ్యక్ష పదవి కోసం కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, శశథరూర్‌కు మధ్య గట్టి పోటీ జరగనుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఓటుహక్కు కలిగిన నేతలంతా ఆయా రాష్ట్రాల్లోనే ఓటు హక్కు వినియోగించుకునేలా పార్టీ అధిష్ఠానం ఏర్పాట్లు చేసింది. రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్‌ జరగనున్నట్లు కేంద్ర ఎన్నికల అథారిటీ ఛైర్మన్ మధుసూదన్‌ మిస్త్రీ వెల్లడించారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. కాంగ్రెస్‌ తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌లు ఢిల్లీలోనే తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని ఆయన తెలిపారు.

ప్రస్తుతం కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్ర పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ యాత్ర కర్ణాటక, ఏపీ సరిహద్దులో సాగుతోంది. ఈ క్రమంలో అధ్యక్ష ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఏపీ, కర్ణాటక సరిహద్దు గ్రామం సుగినేకళ్‌లో ఏర్పాటు చేసిన క్యాంపులో రాహుల్‌ గాంధీ ఓటు హక్కు వినియోగించనున్నారు. రాహుల్‌తో యాత్రలో సాగుతున్న ఇతర రాష్ట్రాల నేతలు కూడా ఇక్కడే ఓటు వేయనున్నారు. ఇక యాత్రలో పాలుపంచుకుంటున్న ఏపీ నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కర్నూలులో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. రాహుల్‌తో యాత్రలో పాల్గొంటున్న మరో 40 మంది ప్రతినిధులు సైతం ఇక్కడే తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని జైరాం రమేశ్‌ ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. 137 ఏళ్ల చరిత్రలో కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక కోసం ఎన్నికలు నిర్వహించడం ఇది ఆరోసారి. 24 సంవత్సరాల అనంతరం తొలిసారిగా గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తి కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు.

CS Somesh Kumar: లారీ ఓనర్స్ అసోసియేషన్‌తో భేటీ.. టీఆర్ఎస్‌కే మద్దతు

దాదాపు 9వేల మందికి పైగా సోమవారం జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల పీసీసీ కార్యాలయాల్లో, ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో, భారత్ జోడో యాత్ర క్యాంప్‌లో కూడా పోలింగ్ జరగనుంది. ప్రతి రాష్ట్రానికి ఒక రిటర్నింగ్‌ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా పలువురు నేతలను కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఎంపిక చేసింది. మరోవైపు ఎన్నికల నేపథ్యంలో మల్లికార్జున ఖర్గే, శశిథరూర్‌లు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. పీసీసీ ప్రతినిధుల మెప్పు పొందే ప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గే ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్కువ మంది సీనియర్లు ఆయనకే మద్దతునిస్తున్నారు. ఈ విషయంలో శశిథరూర్‌ ఆరోపణలు గుప్పించినా.. తాము తటస్థంగా ఉన్నామని గాంధీ కుటుంబం స్పష్టం చేసింది.

ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. సీనియర్ల మద్దతు ఎక్కువగా ఉన్న మల్లికార్జున ఖర్గే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొదటి నుంచి గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్న ఖర్గేకు వివాదరహితుడు అనే పేరు కూడా ఉంది. దళిత వర్గానికి చెందిన నేత కావడం ఆయన కలిసొచ్చే అంశం. అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న శశిథరూర్‌ కాంగ్రెస్‌లో ఉన్న తెలివైన నాయకుల్లో ఒకరు. అంతర్జాతీయ గుర్తింపు ఉన్న అతికొద్ది కాంగ్రెస్ నాయకులు థరూర్‌ ముందుంటారు. కాంగ్రెస్ అధిష్ఠానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ లేఖ రాసిన జీ23 బృందంలో ఆయన ఒకరు కాగా.. ఇది ఆయనకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో ఖర్గే విజయం తథ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు.

Exit mobile version