KK Mahender Reddy : రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాజకీయ వేడి పెరుగుతోంది. ఈ క్రమంలో సిరిసిల్ల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ ఇంచార్జి కేకే మహేందర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేకే మహేందర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ పుట్టింది అబద్ధపు ప్రచారాలతో అని ఆయన విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని అని ఆరోపించారు. కేసీఆర్ నిరాహార దీక్ష చేస్తానని చెప్పి, జ్యూస్ తాగిన వ్యవహారాన్ని ప్రజలు మర్చిపోలేరు అని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది సోనియా గాంధీ తీర్మానంతోనే అని గుర్తుచేశారు. ఆమె మాటకు నిలబడిన గొప్పతనం గుర్తు చేస్తూ, రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా పని చేస్తోందన్నారు కేకే. ఆర్థికంగా రాష్ట్రం కష్టాల్లో ఉన్నా, సోనియా గాంధీ ఆదేశాలతో, రాహుల్ గాంధీ మార్గదర్శకత్వంలో ప్రతి ఒక్క హామీని అమలు చేస్తోంది కాంగ్రెస్ సర్కార్ అని తెలిపారు. రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనల ద్వారా లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చారని చెప్పారు కేకే. ఉచిత బస్సు సేవలు, ఉచిత విద్యుత్, రైతు బంధు, మహిళా సంక్షేమం వంటి పథకాలు ప్రజలకు అందిస్తున్నామని ఆయన తెలిపారు..
సెంట్రల్ యూనివర్సిటీకి భూమి కేటాయించిందెవరు? కాంగ్రెస్ ప్రభుత్వం కదా.. అని కేకే ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు దాన్ని అడవి ప్రాంతమని చెబుతూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని కేకే మహేందర్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీని ‘అబద్దాల యూనివర్శిటీ’గా అభివర్ణిస్తూ.. వారి నాయకులు ఒక మాట, వారి వారసులు మరో మాట మాట్లాడుతున్నారంటూ ఆయన విమర్శించారు. “ఫేక్ మాస్టర్ లవి అన్నీ ఫేక్ ముచ్చట్లే,” అంటూ ఆయన ఎద్దేవా చేశారు కేకే మహేందర్.
బీజేపీ ఎప్పుడూ ప్రజల కోసం పోరాడలేదని, కాంగ్రెస్ మాత్రం చట్టాలపై నమ్మకంతో ముందుకు సాగుతుందని చెప్పారు. అసెంబ్లీకి బయపడే బీఆర్ఎస్ నేతలు, అసెంబ్లీ పని ఎరిగని బీజేపీ నేతల మధ్య ప్రజలకు అన్యాయం జరగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుదిట్టంగా ముందుకు వెళ్తుందని కేకే మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు.
YSRCP: విశాఖ మేయర్ ఎన్నికలో కొత్త ట్విస్ట్..! వారిపై వైసీపీ ఫిర్యాదు
