NTV Telugu Site icon

Pune Porsche accident: పోర్షే కార్‌ యాక్సిడెంట్‌ కేసులో జస్టిస్‌ బోర్డు ఆదేశాలపై కాంగ్రెస్ వినూత్న నిరసన

New Project (45)

New Project (45)

పూణేలో జరిగిన రోడ్డు ప్రమాదం దేశంలో చర్చనీయాంశమైంది. ఇక్కడ వేగంగా వస్తున్న లగ్జరీ కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. కారును 17 ఏళ్ల మైనర్ మద్యం మత్తులో నడిపాడు. కాగా ఈ కేసునులో ముఖ్యంగా ప్రమాదానికి కారణమైన బాలుడి చేత వ్యాసం రాయించాలని జువైనల్‌ జస్టిస్‌ బోర్డు ఆదేశాలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాలుడి తండ్రి ఓ ప్రముఖ బిల్డర్‌ కావడంతో పోలీసులు ఈ కేసును నీరుగారుస్తున్నారన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో అధికార ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ యువజన విభాగం వినూత్న రీతిలో నిరసన తెలిపింది. కారు ప్రమాదం జరిగిన ప్రదేశంలో వ్యాస రచన పోటీని నిర్వహించింది. ‘ఒకవేళ మా నాన్న బిల్డర్‌ అయితే?’, ‘ఆల్కహాల్‌ వల్ల కలిగే దుష్పరిణామాలు’ ‘అధికార వ్యవస్థ నిద్ర పోతోందా?’ వంటి అంశాలపై వ్యాస రచన పోటీ నిర్వహించింది.

READ MORE: Anjali Bhaskar: బస్సులో నన్ను అక్కడ తాకాడు.. ఒక్కరు కూడా ఏమనలేదు.. నటి షాకింగ్ కామెంట్స్!

ఆదివారం నిర్వహించిన ఈ పోటీకి సుమారు 100 మంది హాజరయ్యారు. ఆకట్టుకునేలా వ్యాసం రాసిన వారికి రూ.11వేలు, రూ.7 వేలు, రూ.5 వేలు చొప్పున బహుమతులు ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపరు. ఈ వ్యాసాలను పూణే పోలీసుల కమిషనరుకు పంపుతామని తెలిపారు. మే 19న జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో కేవలం 15 గంటల్లోనే బాలుడికి జువైనల్‌ జస్టిస్‌ బోర్డు బెయిల్‌ మంజూరుచేసిన తీరును నిరసిస్తూ యూత్‌ కాంగ్రెస్‌ ఈ రూపంలో నిరసన తెలియజేసింది. వరైనా యాక్సిడెంట్‌ చేస్తే వారి కుటుంబ సంబంధాలను దృష్టిలోపెట్టుకుని ఇలానే 300 పదాలు, 600 పదాల వ్యాసం రాయిస్తారా? అని పుణె కాంగ్రెస్‌ నేత సంగీత తివారీ ప్రశ్నించారు.

కాగా.. పూణె నగరంలో మే 18-19 మధ్య రాత్రి, 17 ఏళ్ల బాలుడు మూడు కోట్ల రూపాయల విలువైన పోర్షే కారును అతి వేగంతో నడుపుతూ బైక్‌ను ఢీకొట్టాడు. వాహనం ఢీకొనడంతో బైక్‌ బ్యాలెన్స్‌ తప్పి చాలా దూరం రోడ్డుపై ఈడ్చుకెళ్లడంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలంలో ఉన్న వ్యక్తులు ప్రమాదంపై పోలీసులకు సమాచారం అందించగా, నిందితుడు మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన జరిగిన 14 గంటల తర్వాత, నిందితుడు మైనర్ కొన్ని షరతులతో కోర్టు నుండి బెయిల్ పొందాడు. 15 రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులతో కలిసి పని చేయాలని, రోడ్డు ప్రమాదాల ప్రభావాలు, పరిష్కారాలపై 300 పదాల వ్యాసాన్ని రాయాలని కోర్టు ఆదేశించింది. తర్వాత వివాదం ముదిరిపోవడంతో కోర్టు అతడి బెయిల్‌ను రద్దు చేసింది. అనంతరం జూన్‌ 5 వరకు అబ్జర్వేషన్‌ హోంకు తరలించారు. దీంతో పాటు ఈ కేసులో మైనర్ తండ్రి, తాతలను కూడా అరెస్టు చేశారు.