NTV Telugu Site icon

Uttam Kumar Reddy : ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్‌కు కీలకం

Uttam Kumar Reddy

Uttam Kumar Reddy

Uttam Kumar Reddy : కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన బంజారాహిల్స్ నివాసంలో పార్టీ శ్రేణులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంతకు ముందు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రేపటి స్థానిక సంస్థల ఎన్నికలకు రిహార్సల్స్ అవుతాయని అన్నారు. ఎన్నికల నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో పార్టీ కేడర్, నేతలను అప్రమత్తం చేసి కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి వ్యూహాత్మకంగా పని చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ప్రతి ఓటు కీలకమైందని, పార్టీ యంత్రాంగాన్ని సమర్థంగా వినియోగించుకుంటే గెలుపు సులభమవుతుందన్నారు.

ఈ ఎన్నికల విజయంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించేందుకు వీలవుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని, ఉపాధ్యాయ నియామకాలు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, విద్యార్థులకు కల్పించిన ప్రయోజనాలను వివరించాలని సూచించారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకురాగలిగితే, వెంటనే పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ప్రజాప్రతినిధులకు, పార్టీ శ్రేణులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, శాసనమండలి సభ్యులు జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, రాజ్ ఠాకూర్, డాక్టర్ సంజయ్, వెలిచాల రాజేందర్ రావు, మేడిపల్లి సత్యం, వడితేల ప్రణవ్, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు.

Rammohan Naidu: యుద్ధ విమానంలో ప్రయాణించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు