Congress Complaints to CBI: టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీలపై హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయంలో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేత మల్లు రవి నేతృత్వంలో సీబీఐ అధికారులకు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. రెండ్రోజుల క్రితం ఈడీ అధికారులకు కాంగ్రెస్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సీబీఐ అధికారులకు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ప్రశ్నాపత్రాలు లీకేజీ కారణంగా 30 లక్షల మంది నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ మల్లు రవి వాపోయారు. కోచింగ్ సెంటర్‌లలో లక్షల రూపాయలు ఖర్చు చేశారని.. 2014 నుంచి ప్రిపేర్ అవుతుంటే నోటిఫికేషన్‌లు ఇప్పుడే వచ్చాయని ఆయన తెలిపారు. ఇన్విజిలేటర్‌లు కూడా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులే వుండటం వల్ల చివరకు పదోతరగతి పరీక్ష ప్రశ్న పత్రాలు కూడా లీక్ అవుతున్నాయని ఆయన ఆరోపించారు.
Read Also: Telangana Congress: కోమటిరెడ్డి పై హైకోర్టుకు చెరుకు సుధాకర్.. నేడే విచారణ
యూత్ కాంగ్రెస్ ఆందోళన చేస్తే పోలీసులు నాన్‌బైలబుల్ కేసులు పెట్టి జైలులో పెట్టారని మల్లు రవి అన్నారు. ప్రభుత్వం లీకులను అరికట్టాలంటే అరెస్ట్‌లు చేస్తోందని.. జైళ్లు, శిక్షలతో కాంగ్రెస్ పోరాటం ఆపదన్నారు. సెక్రటేరియట్, ప్రగతి భవన్‌లను ముట్టడిస్తామన్నారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీపై వేసిన సిట్ కూడా పెద్దవాళ్లను కాపాడేందుకేనని ఆయన ఆరోపించారు. సీబీఐ చేత విచారణ జరిపితే నిజాలు బయటకు వస్తాయన్నారు. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, సభ్యులను రద్దు చేసి కొత్త వాళ్ళతో పరీక్షలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. సీబీఐ చేత కానీ , సిట్టింగ్ జడ్జి చేత కానీ విచారణ జరపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ పేపర్ లీకేజీ వ్యతిరేక కమిటీ నేతలంతా కలిసి సీబీఐని కలిసి వినతిపత్రం అందించినట్లు మల్లు రవి వెల్లడించారు.