Site icon NTV Telugu

Congress: “రాహుల్ గాంధీ శ్రీరాముడట”.. కాంగ్రెస్ నాయకుడి “అతి భజన”పై బీజేపీ ఫైర్..

Rahul Gandhi

Rahul Gandhi

Congress: మహారాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నేత నానా పటోలే, తన అగ్రనేత రాహుల్ గాంధీని ‘‘శ్రీరాముడి’’తో పోల్చడం వివాదాస్పదంగా మారింది. దీనిపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇది ‘‘అతి భజన ప్రో మ్యాక్స్’’గా అభివర్ణించింది. అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరాన్ని రాహుల్ గాంధీ సందర్శించకపోవడంపై అడిగిన ప్రశ్నకు నానా పటోలే సమాధానం ఇస్తూ.. ‘‘శ్రీరాముడు చేసిన పనినే రాహుల్ గాంధీ చేస్తున్నాడు’’ అని అన్నారు.

‘‘రాముడు వేధింపులకు గురైన, వంచనకు గురైన వారికి న్యాయం చేస్తారని, రాహుల్ గాంధీ కూడా ఇదే చేస్తున్నారు’’ అని అన్నారు. రామ మందిరంలో ఫోటో సెషన్ చేయడం కన్నా ఈ సేవ చేయడానికే తమ నేత ఇష్టపడతారని ప్రధాని నరేంద్రమోడీపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. నిజానికి రామ మందిరం తాళాలు తెరవడానికి రాజీవ్ గాంధీనే కారణమని ఆయన గుర్తు చేశారు.

అయోధ్యంలో భవ్య రామ మందిరం నిర్మితమైన తర్వాత రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ ఇతర కాంగ్రెస్ అగ్రనేతలు ఎవరూ కూడా రామ మందిరాన్ని సందర్శించకపోవడంపై బీజేపీ విమర్శలు చేస్తోంది. తాజాగా నానా పటోలే వ్యాఖ్యలపై బీజేపీ కాంగ్రెస్‌పై తీవ్రంగా విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్ హిందూ విశ్వాసాన్ని అవమానిస్తోందని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Pakistan: యుద్ధంలో గెలవడం చేతకాదు కానీ, అబద్ధాలలో గెలుస్తున్న పాకిస్తాన్..

‘‘మరోసారి, కాంగ్రెస్ పార్టీ పరాకాష్ట స్థాయి భజనను ప్రదర్శించింది. రాహుల్ గాంధీ శ్రీరాముడితో సమానమని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. కొద్ది రోజుల క్రితమే, క్రిస్మస్ జరుపుకోవడానికి సోనియా గాంధీయే కారణమని వారు అన్నారు. ఇది ఎలాంటి భజన? ఆపై మీరు హిందూ విశ్వాసాన్ని అవమానిస్తున్నారా? రామ మందిరం నిర్మించకూడదని చెప్పింది ఇదే కాంగ్రెస్ పార్టీ. రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ అంటే ‘పాటలు డ్యాన్స్’ అని చెప్పింది ఇదే కాంగ్రెస్ పార్టీ. వారు హిందూ మతంపై నిరంతరం దాడి చేస్తూ, అవమానిస్తున్నారు’’ అని బీజేపీ నాయకుడు షెహజాద్ పూనావాలా అన్నారు.

ప్రాణప్రతిష్టను ‘‘నాచ్ గానా’’ అని రాహుల్ గాంధీ ఎందుకు ఎగతాళి చేశారని, ఇంకా రామ మందిరాన్ని ఎందుకు సందర్శించలేదని ప్రశ్నించే ధైర్యం పటోలేకు ఉందా? అని బీజేపీ అధికార ప్రతినిధ సీఆర్ కేశవన్ ప్రశ్నించారు. రాహుల్ గాంధీని రాముడితో పోల్చి, కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీశారని, ఇది క్షమించరాని అవమానం అని అన్నారు. గతంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రామ మందిరాన్ని సందర్శించిన తర్వాత, ఇదే పటోలే రామ మందిరాన్ని శుద్ధి చేయాలని సిగ్గుమాలిన వ్యాఖ్యలు చేశారని ఆయన అన్నారు.

Exit mobile version