Commonwealth Games 2026: గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. తాజాగా ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో గుల్వీర్ సింగ్, వేట్‌లిఫ్టింగ్‌లో హర్జిందర్ కౌర్ రజత పతకాలు సాధించడంతో భారత్ పతకాల సంఖ్య 12కు చేరింది. పురుషుల 10,000 మీటర్ల పరుగు పందెంలో గుల్వీర్ సింగ్ ద్వితీయ స్థానంలో నిలిచి చారిత్రాత్మక రజతాన్ని కైవసం చేసుకోగా, మహిళల 69 కేజీల వేట్‌లిఫ్టింగ్ విభాగంలో హర్జిందర్ కౌర్ సంచలన ప్రదర్శనతో రజతాన్ని ముద్దాడింది. మరోవైపు బాక్సింగ్‌లోనూ భారత్‌కు పతకాలు ఖాయమయ్యాయి. ప్రియా ఘంగాస్, ప్రీతి పవార్, జాదుమణి సింగ్ తమ తమ కేటగిరీల్లో సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లడంతో భారత్‌కు కనీసం మూడు పతకాలు ఖాయమయ్యాయి.
అంతకుముందు పారా అథ్లెటిక్స్‌లో షర్మిలా ధంకర్ కొత్త చరిత్ర లిఖించారు. మహిళల షాట్‌పుట్ F57 ఫైనల్లో అగ్రస్థానంలో నిలిచి కామన్వెల్త్ గేమ్స్ పారా అథ్లెటిక్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని అందించారు. వీటితో పాటు జ్ఞానేశ్వరి యాదవ్, సర్వేష్ కుషారే, వల్లూరి అజయ్ బాబు రజత పతకాలు గెలవగా.. బింద్యారాణి దేవి, శిల్పా కె. శైల కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. ప్రస్తుత కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు వేట్‌లిఫ్టింగ్ విభాగామే ప్రధాన బలంగా నిలిచింది. ఇప్పటివరకు ఈ విభాగంలోనే అత్యధికంగా 6 పతకాలు లభించాయి. స్టార్ వేట్‌లిఫ్టర్ మీరాబాయి చాను తన వరుస మూడో విజయాన్ని నమోదు చేస్తూ.. మహిళల 48 కేజీల విభాగంలో మొత్తం 190 కేజీల బరువునెత్తి స్వర్ణ పతకంతో హ్యాట్రిక్ రికార్డు సృష్టించింది.
కామన్వెల్త్ గేమ్స్ 2026: భారత విజేతల పూర్తి జాబితా
పసిడి పతకాలు (స్వర్ణం)
* మీరాబాయి చాను (వేట్‌లిఫ్టింగ్ – మహిళల 48 కేజీలు): మొత్తం 190 కేజీలు (స్నాచ్ 85 కేజీలు + క్లీన్ అండ్ జెర్క్ 105 కేజీలు) ఎత్తి వరుసగా మూడోసారి కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించింది.
* షర్మిలా ధంకర్ (పారా అథ్లెటిక్స్ – మహిళల షాట్‌పుట్ F57): కామన్వెల్త్ గేమ్స్ పారా అథ్లెటిక్స్‌లో భారత్‌కు మొట్టమొదటి స్వర్ణ పతకాన్ని అందించి కొత్త చరిత్ర లిఖించింది.
రజత పతకాలు
* రిషికాంత్ సింగ్ (వేట్‌లిఫ్టింగ్ – పురుషుల 60 కేజీలు): స్నాచ్ విభాగంలో 121 కేజీల గేమ్‌ల రికార్డుతో భారత్‌కు ఈ క్రీడల్లో తొలి పతకాన్ని అందించాడు.
* ముత్తుపాండి రాజా (వేట్‌లిఫ్టింగ్ – పురుషుల 65 కేజీలు): మొత్తం 286 కేజీల బరువునెత్తి రజతాన్ని ఖాయం చేసుకున్నాడు.
* జ్ఞానేశ్వరి యాదవ్ (వేట్‌లిఫ్టింగ్ – మహిళల 53 కేజీలు): మొత్తం 199 కేజీల బరువునెత్తి ఉత్కంఠభరిత పోరులో రజతం సాధించింది.
* వల్లూరి అజయ్ బాబు (వేట్‌లిఫ్టింగ్ – పురుషుల 79 కేజీలు): ప్రత్యర్థులకు గట్టి పోటీనిస్తూ రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
* సర్వేష్ కుషారే (అథ్లెటిక్స్ – పురుషుల హైజంప్): కామన్వెల్త్ గేమ్స్ హైజంప్ విభాగంలో రజతం సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా నిలిచాడు.
* హర్జిందర్ కౌర్ (వేట్‌లిఫ్టింగ్ – మహిళల 69 కేజీలు): ఈ క్రీడల్లో భారత్‌కు పతకం అందించిన 7వ వేట్‌లిఫ్టర్‌గా నిలిచింది.
* గుల్వీర్ సింగ్ (అథ్లెటిక్స్ – పురుషుల 10,000 మీటర్లు): కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలోనే ఈ విభాగంలో పతకం సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు.
కాంస్య పతకాలు
* ఝాండు కుమార్ (పారా పవర్‌లిఫ్టింగ్ – పురుషుల హెవీవెయిట్): 190 కేజీల బరువునెత్తి గ్లాస్గోలో భారత్ పతకాల ఖాతాను తెరిచాడు.
* బింద్యారాణి దేవి (వేట్‌లిఫ్టింగ్ – మహిళల 58 కేజీలు): మొత్తం 199 కేజీల బరువునెత్తి తన కెరీర్‌లో రెండో కామన్వెల్త్ పతకాన్ని సాధించింది.
* శిల్పా శైల (పారా అథ్లెటిక్స్ – మహిళల షాట్‌పుట్ F57): భారత బృందం వేసిన అధికారిక అప్పీల్ విజయవంతం కావడంతో శిల్పకు కాంస్య పతకం దక్కింది.

