తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దళిత బంధు పథకానికి ఆగస్ట్ 16న శ్రీకారం చుట్టారు సీఎం కేసీఆర్. హుజురాబాద్‌లో పర్యటించి మరీ… ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం కేసీఆర్. హుజురాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా దళిత బంధును ప్రారంభించారు. ముందుగా అర్హులైన 15 కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు ముఖ్యమంత్రి. అయితే… తాజాగా దళితబంధు ఇంటింటి సమగ్ర సర్వే కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో శుక్రవారం ప్రారంభమైంది. సర్వే కోసం దళితవాడలకు వచ్చిన అధికారుల బృందాలు దళితులతో మమేకమై వివరాలు సేకరించాయి.
ఇంటింటికి వెళ్లిన అధికారులు ఒక్కో కుటుంబంతో 20 నిమిషాలపాటు మాట్లాడి సమగ్ర వివరాలు సేకరించారు. రేషన్ కార్డు, ఆధార్‌కార్డు, భూముల వివరాలు తెలుసుకున్నారు. సొంత ఇల్లా లేక అద్దె ఇల్లా అని ఆరా తీశారు. పాత బ్యాంకు ఖాతా వివరాలను తీసుకున్నారు. వారి ఆర్థిక స్థితిగతులు, ప్రస్తుతం చేస్తున్న పని గురించి వాకబు చేశారు. దళితబంధు కింద ఏ యూనిట్ ఎంచుకుంటారు..?, ఏం చేస్తారు..?, ఆర్థికంగా ఎలా ఎదుగుతారు..? అని అడిగారు. దళితబంధు బ్యాంకు ఖాతాల కోసం ఫొటోలు, ఆధార్‌కార్డులను సేకరించారు.