Social Media Weight Loss Tip: సోషల్ మీడియాలో వచ్చిన ఓ వీడియోను నమ్మి బరువు తగ్గేందుకు ప్రయత్నించిన ఓ కాలేజీ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. స్థానిక దుకాణంలో కొనుగోలు చేసిన ‘వెంకారం’ (బోరాక్స్) అనే పదార్థాన్ని సేవించడంతో యువతి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలు కలైయరసి (19) మదురై నగరంలోని సెల్లూర్ ప్రాంతం, మీనాంబల్పురానికి చెందింది. ఆమె తండ్రి వెల్ మురుగన్ (51) రోజువారీ కూలీగా పనిచేస్తుండగా, తల్లి విజయలక్ష్మి గృహిణి. కలైయరసి నరిమేడు ప్రాంతంలోని ప్రముఖ ప్రైవేట్ మహిళా కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది మృతురాలు.
Supreme Court Recruitment 2026: సుప్రీంకోర్టులో లా క్లర్క్ పోస్టులు.. నెలకు రూ. లక్ష శాలరీ
అమ్మాయి కాస్త అధిక బరువు ఉండటంతో బరువు తగ్గే మార్గాల కోసం ఆమె తరచూ ఆన్‌లైన్ వీడియోలు చూస్తుండేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో ‘వెంకారంతో కొవ్వు కరుగుతుంది, శరీరం సన్నబడుతుంది’ అనే శీర్షికతో ఉన్న యూట్యూబ్ వీడియోను ఆమె ఇటీవల వీక్షించిందని.. అందులో చెప్పిన సూచనల మేరకు జనవరి 16న కీజమాసి వీధి సమీపంలోని స్థానిక మందుల దుకాణంలో వెంకారాన్ని కొనుగోలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. జనవరి 17న ఆ వీడియోలో చెప్పిన విధంగా వెంకారాన్ని సేవించిన వెంటనే కలైయరసికి వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి.
ఈ ఘటనతో ఆమెను తల్లి వెంటనే మునిసలై ప్రాంతంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స అనంతరం ఇంటికి తీసుకువచ్చారు. అయితే అదే రోజు సాయంత్రం మళ్లీ లక్షణాలు తీవ్రమయ్యాయి. సమీపంలోని మరో ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం ఇంటికి వచ్చిన ఆమె తీవ్ర కడుపు నొప్పి, మలంలో రక్తం రావడంతో తండ్రిని పట్టుకుని కన్నీరుమున్నీరుగా విలపించింది. దానితో రాత్రి 11 గంటల సమయంలో వాంతులు, విరేచనాలు మరింత తీవ్రం కావడంతో పొరుగువారి సహాయంతో ఆమెను ప్రభుత్వ రాజాజీ ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలోనే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై సెల్లూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సోషల్ మీడియా వీడియోల ప్రభావంతో ప్రమాదకర పదార్థాలను వినియోగించడం ఎంతటి ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి రుజువు చేస్తోందని పోలీసులు తెలిపారు.