మూడు దశాబ్దాల తర్వాత తోడల్లుళ్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఒకే వేదికపైకి రాబోతున్నారు. వెంకటేశ్వర రావు రచించిన ‘ప్రపంచ చరిత్ర’ అనే పుస్తక ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా చంద్రబాబు రానున్నారు. గురువారం విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. పుస్తక ఆవిష్కరణ కోసం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం.. అర్ధరాత్రి విశాఖపట్నం చేరుకున్నారు. ఈ కార్యక్రమంకు కేంద్రమంత్రి నిర్మల సీతారామన్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా హాజరుకానున్నారు.
చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వర రావు కొన్నేళ్లుగా కుటుంబ కార్యక్రమాల్లో తరచుగా కలుసుకుంటున్నారు. అయితే ఇద్దరూ ఒకే బహిరంగ వేదికపైకి రావడం మాత్రం 30 ఏళ్లలో ఇదే తొలిసారి. ఇటీవలే ఉండవల్లిలో సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లిన దగ్గుబాటి.. పుస్తకావిష్కరణ కార్యక్రమంకు రావాలని ఆహ్వానించారు. దగ్గుబాటి రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకాన్ని తెలుగు, ఆంగ్ల భాషల్లో ప్రచురించారు. తెలుగు పుస్తకాన్ని వెంకయ్యనాయుడు, ఆంగ్ల పుస్తకాన్ని నిర్మలా సీతారామన్ ఆవిష్కరించనున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వర రావు సతీమణి పురందేశ్వరి ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంను దగ్గరుండి చూసుకుంటున్నారు. పుస్తకావిష్కరణ తర్వాత గీతం ప్రాంగణంలో జరుగుతున్న జాబ్ మేళాలో యువతతో సీఎం చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. అనంతరం సీఎం ఢిల్లీకి వెళ్లనున్నారు.