Site icon NTV Telugu

CM YS Jagan: వైద్య ఆరోగ్య శాఖపై సీఎం సమీక్ష.. అదనంగా 2,100 ఎంబీబీఎస్‌ సీట్లు

Ys Jagan

Ys Jagan

CM YS Jagan: వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. పలు అంశాలపై ఆరా తీశారు.. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కడా కూడా సిబ్బంది లేరనే మాట రాకూడదన్న ఆయన.. క్రమం తప్పకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆడిట్‌ చేయాలన్నారు.. మౌలిక సదుపాయాలు, మందులు కూడా సరిపడా ఉండేలా చూసుకోవాలని.. ప్రతి సమీక్షా సమావేశంలో కూడా సిబ్బంది ఎంతమంది ఉన్నారు? ఎన్ని ఖాళీలు ఉన్నాయన్న దానిపై వివరాలు సమర్పించాలంటూ ఆదేశించారు.. ఇక, కోవిడ్‌ తాజా పరిస్థితులపై సీఎంకు వివరాలను అందించారు అధికారులు.. రాష్ట్రంలో కోవిడ్‌ పూర్తిగా అదుపులో ఉందని.. గత వారంరోజుల్లో దేశ వ్యాప్తంగా నమోదైన కేసుల్లో రాష్ట్రం 23 స్థానంలో ఉందన్నారు.. ఇక, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య ప్రస్తుతం 24 మందిగా ఉందని వెల్లడించారు.

Read Also: Tuni Train Burning Case: తుని రైలు దగ్ధం కేసును కొట్టివేసిన కోర్టు.. వారిపై చర్యలకు ఆదేశాలు

మరోవైపు.. ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమాన్ని అత్యంత పకడ్బందీగా అమలు చేయాలని స్పష్టం చేశారు సీఎం జగన్‌.. గ్రామాల విజిట్స్ లో వైద్యులు ఎస్‌ఓపీ కచ్చితంగా అమలు కావాలన్న ఆయన.. ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్‌ 6వ తేదీ నుంచి 28వ తేదీ వరకు 20,25,903 మందికి సేవలు అందించాయం.. 10,032 గ్రామాల్లో ఫ్యామిలీ డాక్టర్‌ వైద్య సేవలు అందించారని తెలిపారు. ఇక, క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయాలని ఆదేశించారు సీఎం జగన్‌.. ఎవరికి సమస్య ఉన్నా వారికి వెంటనే పరీక్షలు చేయించాలన్న ఆయన.. నెల, రెండు నెలలకోసారి ఈ పరీక్షలు జరగాలన్నారు.. దీనిపై కార్యాచరణ చేసి తనకు నివేదించాలని ఆదేశించారు.

ఇక, రక్తహీనత, పౌష్టికాహార లేమిని పూర్తిగా నివారించాలని పేర్కొన్నారు సీఎం జగన్.. విలేజ్‌ క్లినిక్స్‌ ద్వారా వీటిని నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్న ఆయన.. రక్తహీనతతో బాధపడుతున్న గర్భవతులకు తప్పనిసరిగా పౌష్టికాహారం అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.. మరోవైపు.. కొత్తగా నిర్మిస్తున్న మెడికల్‌ కాలేజీ పనులపై సీఎం సమీక్ష నిర్వహించారు.. కొత్త మెడికల్‌ కాలేజీల వల్ల రాష్ట్రంలో అదనంగా 2,100 ఎంబీబీఎస్‌ సీట్లు వస్తాయన్నారు.. ప్రస్తుతం ఉన్న 2185 మెడికల్‌ సీట్లకు ఇవి అదనంగా వెల్లడించారు.. ఈ విద్యాసంవత్సంలో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కాలేజీల్లో తరగతులు ప్రారంభం అవుతాయని.. ఈ ఐదు కాలేజీల ద్వారా 750 సీట్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.

Exit mobile version