CM Jagan Delhi Tour: మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి హస్తినబాట పట్టారు.. రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం జగన్ బయలుదేరతారు. పదిన్నరకు గన్నవరం విమానాశ్రయం చేరుకుని ప్రత్యేక ఫ్లైట్ లో కోసం ఢిల్లీకి పయనం అవుతారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఢిల్లీకి చేరుకుంటారు. సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలతో సీఎం జగన్ భేటీ అవనున్నట్లు సమాచారం. ఈ ఇద్దరితో కీలక భేటీ తర్వాత రాత్రికి ఢిల్లీలోనే బస చేస్తారు. అయితే, ఏపీలో నెలకొన్ని రాజకీయ పరిస్థితుల దృష్ట్యా సీఎం హస్తిన పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది..
Read Also:Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
ఇక, గురువారం ఉదయం 10 గంటలకు విజ్ఞాన్ భవన్ కు వెళతారు సీఎం జగన్. హోమ్ మంత్రి అమిత్ షా నేతృత్వంలో జరుగనున్న మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. దేశంలో పది మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, కేరళ, మధ్యప్రదేశ్, ఛత్తీశ్ ఘడ్, జార్ఘండ్, పశ్చిమ బెంగాల్, బీహార్ పాల్గొననున్నాయి. ఈ సమావేశానికి ముఖ్యమంత్రులతో పాటు ఆయా రాష్ట్రాల సీఎస్ , డీజీపీలు, సంబంధిత కేంద్ర శాఖల ఉన్నతాధికారులు కూడా హాజరుకానున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొని రాష్ట్రంలోని పరిస్థితులు, గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Read Also: Chandrababu: నేటితో ముగియనున్న చంద్రబాబు రిమాండ్.. కోర్టు నిర్ణయంపై ఉత్కంఠ
ఈ సమావేశం తర్వాత గురువారం కూడా ముఖ్యమంత్రి ఢిల్లీలోనే బస చేసే అవకాశాలు ఉన్నాయి. అందుబాటులో వున్న ఇతర కేంద్ర మంత్రులతో కూడా ముఖ్యమంత్రి భేటీ అవనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఖరారు అయ్యే అపాయింట్ మెంట్లను బట్టి గురువారం రాత్రికి తిరిగి విజయవాడకు వచ్చే అవకాశం ఉంది. లేని పక్షంలో ఈనెల 7న ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ముగించుకుని తాడేపల్లికి తిరిగి వస్తారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోమ్ మంత్రి అమిత్ షాతో జరిగే సమావేశంలో ఏ అంశాలు చర్చకు వస్తాయన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. ముఖ్యంగా స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్.. టీడీపీ-జనసేన అలయెన్స్.. పవన్ కల్యాణ్ ఎన్డీఏకు గుడ్‌బై చెబుతున్నట్టు ప్రకటించిన తర్వాత సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది.