NTV Telugu Site icon

CM YS Jagan: చంద్రబాబు అరెస్ట్‌పై తొలిసారి స్పందించిన సీఎం జగన్‌.. బాబు, పవన్‌పై సంచలన వ్యాఖ్యలు

Jagan

Jagan

CM YS Jagan: అంతా ఊహించినట్టుగా జరిగింది.. ఏపీ స్కిల్‌డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ అయిన తర్వాత తొలిసారి ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.. నిడవోలులో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాను చంద్రబాబు లాగా మోసాలు చేయలేదన్నారు.. అవినీతి కేసులో అరెస్టయిన మహానుభావుడి గురించి నాలుగు మాటలు చెప్తా.. ఆలోచించండి అంటూ సూచించిన ఆయన.. ఇన్ని దొంగతనాలు చేసినా, ఎన్ని వెన్నుపోట్లు పొడిచినా చంద్రబాబును రక్షించు కునేందుకు దొంగలా ముఠా ఉంది అని ఆరోపించారు.. కానీ, చట్టం ఎవరికైనా ఒక్కటే.. మాన్యుడికి ఎలాంటి శిక్ష పడుతుందో.. అదే శిక్ష రాజకీయ నాయకులకు వర్తిస్తుంది అని చెప్పేవాళ్లు చంద్రబాబుకు లేరు అని సెటైర్లు వేశారు.

ఇక, ఆడియో, వీడియో టేపుల్లో చంద్రబాబు దొంగగా అడ్డంగా దొరికినా కూడా దోపిడీ సొమ్ము అని ప్రజలకు అర్థం అయినా కూడా బాబు చేసింది నేరమే కాదని వాదించే వాళ్లు సిద్ధం అయ్యారని మండిపడ్డారు సీఎం జగన్‌.. నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి ఏ ఒక్కరూ రెడీగా లేరన్న ఆయన.. చంద్రబాబు దోచిన దాంట్లో వాటదారులు కాబట్టి.. ఇంత అన్యాయం జరుగుతున్న ప్రశ్నిస్తా.. ప్రశ్నిస్తా.. అన్నవాడు ప్రశ్నించడు. ఎలాంటి ప్రపంచంలో బతుకుతున్నాం అనేది ఆలోచించాలని ప్రజలకు సూచించారు. ఫేక్ అగ్రిమెంట్ సృష్టించి నిబంధనలు పక్కన పెట్టి దోపిడీ చేశారు ఆరోపించారు వైఎస్ జగన్‌.. సీమెన్స్ తమకు డబ్బు ముట్ట లేదు అని చెప్పింది.. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆధారాలతో నిర్ధారించిందని పేర్కొన్నారు.

చంద్రబాబు చేసిన తప్పులు ప్రశ్నించకుండా నేరుగా జైలుకు వెళ్లి ములాఖత్ లో మిలాఖత్ చేసుకుని పొత్తు పెట్టుకుంటారు అంటూ టీడీపీ-జనసేన పొత్తు విషయంలో పవన్‌ కల్యాణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం జగన్‌.. ములాఖత్ లో మిలాఖత్ లు చేసుకునే వారి గురించి ప్రజలు ఆలోచించాలని సూచించారు. మీ బిడ్డ ప్రభుత్వ హయాంలో మీకు ఎంత లబ్ధి చేకోరిందో చూడాలని విజ్ఞప్తి చేశారు.. గత ప్రభుత్వం లో ఎంత ఆదాయం ఉందో, వైసీపీ ప్రభుత్వంలో అదే ఆదాయం ఉంది.. కోవిడ్ వచ్చినా 2 లక్షల 35వేల కోట్లు అక్క చెల్లెమ్మ ల ఖాతాలో వేశామని గుర్తుచేశారు. దత్త పుత్రుడు అండ ఉందని ఖండకావరం లేదు.. మీ బిడ్డకు ఇలాంటి వాళ్ళు లేరు.. ప్రజల అండ ఉంది.. జరగబోయే కురుక్షేత్ర యుద్ధంలో మీ బిడ్డ ఒక వైపు, అన్యాయం మరో ఉంది మీకు న్యాయం జరిగిందనిపిస్తేనే మీ బిడ్డకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు సీఎం వైఎస్‌ జగన్‌.