NTV Telugu Site icon

CM YS Jagan: అన్ని వర్గాలను మోసం చేశారు.. చంద్రబాబుపై ధ్వజమెత్తిన సీఎం జగన్‌

Ys Jagan

Ys Jagan

CM YS Jagan: టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఏలూరు జిల్లా నూజివీడులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో అన్ని వర్గాలను మోసం చేశారని విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతా దోపిడినే జరిగింది.. ప్రజలకు మంచి చేసి చంద్రబాబు ఎప్పుడూ సీఎం కాలేదన్నారు. తొలిసారి వెన్నుపోటుతో, రెండోసారి కార్గిల్‌ యుద్ధం పుణ్యాన, మూడోసారి రుణమాఫీతో అధికారంలోకి వచ్చారంటూ పేర్కొన్నారు. త్వరలోనే ఎన్నికలు రానున్నాయి.. మోసం చేయడానికి మీ ముందుకు వస్తారు.. ఎన్నో హామీలు ఇస్తారు.. దొంగల ముఠా అంతా ఏకమై ప్రతి ఇంటికి బెంజ్‌ కారు ఇస్తామంటారు.. నమ్మి మోసపోవద్దని హితవు పలికారు. గతంలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఏకమై ఇచ్చిన హామీలు నెరవేర్చారా? మీరే ఆలోచించాలని సూచించారు. తనకు ప్రజా దీవెనలు ఉన్నంత వరకు ఎవరితోనూ పొత్తు పెట్టుకోనని మరోసారి స్పష్టం చేశారు సీఎం వైఎస్ జగన్‌.

ఇక, రాష్ట్రవ్యాప్తంగా 46,463.82 ఎకరాలను వ్యవసా­యం కోసం కొత్తగా 42,307 మందికి డీకేటీ పట్టాలు పంపిణీ చేశారు సీఎం జగన్‌. నిరుపేదలకు భూముల పంపిణీని ప్రారం­భించడంతోపాటు అసైన్డ్‌ భూములకు యా­జమాన్య హక్కులు కల్పించడం, లంక భూములకు పట్టాలు అందజేశారు. చుక్కల భూములు, షరతుల గల పట్టా భూ­ములు, సర్వీస్‌ ఈనాం భూములను 22 ఏ జా­బితా నుంచి తొలగించడం, భూమి కొనుగోలు పథకం కింద ఇచ్చిన భూము­లపై హక్కుల కల్పన, గిరిజనులకు ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాల పంపిణీని సీఎం జగన్‌ ఈ సభలో ప్రారంభించారు. శ్మశాన వాటికలు లేని దళిత వాడల కోసం రాష్ట్రంలో 1,563 గ్రామాల్లో 951 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించింది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.. రైతుల భూ సమస్యలకు పరిష్కారం చూపిస్తూ.. కొత్తగా డీకేటీ పట్టాలను అందిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపిన ఆయన..చుక్కుల భూములకు సైతం పరిష్కారం చూపించామని, అసైన్డ్‌ భూములు, లంక భూములకు భూ హక్కులు కల్పిస్తున్నామని చెప్పారు. భూ తగాదాలకు పరిష్కారం చూపిస్తూ రికార్డులు అప్‌డేట్‌ చేస్తున్నామన్నారు.

మరోవైపు, ప్రజలకు మంచి చేసి చంద్రబాబు సీఎం కాలేదు. చంద్రబాబుకు మంచి చేద్దామనే ఆలోచనే లేదు. బాబు సీఎంగా ఉన్నప్పుడు అంతా దోపిడీనే. బాబు హయాంలో అందరినీ మోసం చేశాడని మండిపడ్డారు సీఎం జగన్‌.. చంద్రబాబుకు మిగతా సామాజిక వర్గాలపై ఎలాంటి అభిప్రాయం ఉందో గుర్తు తెచ్చుకోవాలని సూచించిన ఆయన.. ఎస్సీలో ఎవరైనా పుట్టాలనుకుంటారా, బీసీల తోకలు కత్తిరిస్తానని చంద్రబాబు చెప్పిన విషయాన్ని మరోసారి గుర్తు చేశారు. ఎన్నికలు దగ్గరవుతున్న కొద్దీ తోడేళ్లంతా ఏకమవుతున్నారని సీఎం జగన్‌ మండిపడ్డారు సీఎం వైఎస్‌ జగన్‌.