తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. డీఎంకే పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన తీసుకునే నిర్ణయాలపై ఇటు ప్రజలు, అటు సోషల్ మీడియాలో కూడా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఉచిత విద్య విషయంలో ఎక్కడా రాజీపడకూడదని అధికారులను ఆదేశించడంతో పాటు అసెంబ్లీకి వచ్చే మంత్రులు, ఎమ్మెల్యే ఎవరి భోజనం వారే ఇంటి నుంచి తెచ్చుకోవాలని ఆదేశించారు. క్యాంటీన్ కూడా మూసివేయించారు. ప్రజాధనం వృథా కాకుండా ఇలాంటి చర్యలు తీసుకుంటున్నట్టు వివరణ ఇచ్చారు స్టాలిన్.
తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయంపై పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ వారానికి ఒకరోజు వీక్ ఆఫ్ తీసుకొవచ్చని ప్రకటించారు. వర్క్ బర్డెన్, సెలవులు లేకుండా పోలీసులు రోజు విధుల్లో ఉండటం వలన వారి ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పోలీసులకు వీక్లీ ఆఫ్ లతో పాటు.., గార్డు నుంచి ఇన్‌స్పెక్టర్ వరకు తమ గుర్తింపుకార్డును చూపించి, తాము పనిచేసే జిల్లా పరిధిలోని బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించనున్నారు. దీనికోసం ఆధునిక గుర్తింపుకార్డును అందజేయనున్నారు. సెకండ్ క్లాస్ నుంచి హెడ్ కానిస్టేబుల్ వరకు గార్డులకు వారానికి ఒకరోజు సెలవు ఇవ్వనున్నారు.
2021 సెప్టెంబర్ 13న తమిళనాడు శాసనసభలో పోలీస్ గ్రాంట్‌పై జరిగిన చర్చ లో…పోలీసుశాఖలో ఉద్యోగులకు వారానికి ఒక రోజు సెలవు ఇస్తామనని సీఎం ప్రకటించారు. దీనిపై ఇవాళ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులు వారి కుటుంబ సభ్యులతో గడపడానికి, వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెబుతోంది.