NTV Telugu Site icon

CM Revanth Reddy : చ‌ట్టస‌భ‌ల్లో అవ‌కాశం ఇవ్వండి.. ఏపీలో రేవంత్‌

Cm Revanth Reddy

Cm Revanth Reddy

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు కావాల్సింది పాల‌కులు కాద‌ని ప్ర‌శ్నించే గొంతుక‌ల‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆ ఇద్ద‌రు (చంద్ర‌బాబు నాయుడు, జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి) పాలించే నాయ‌కులు కావాల‌నుకుంటున్నారే త‌ప్ప ప్ర‌శ్నించే గొంతుక‌లు కావాల‌నుకోవ‌డం లేద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ఇక్క‌డి నాయ‌కుల‌కు ప్ర‌శ్నించే త‌త్వం లేనందునే ప‌దేళ్ల‌యినా పోల‌వ‌రం పూర్తికాలేద‌ని, రాజ‌ధాని ఎక్క‌డో చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంద‌ని, ప‌దేళ్లుగా ఇక్క‌డి పాల‌కులు ఆత్మ‌గౌర‌వాన్ని ఢిల్లీకి తాక‌ట్టు పెట్టార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. విశాఖ‌ప‌ట్నంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ ఆధ్వ‌ర్యంలో శ‌నివారం జ‌రిగిన *విశాఖ ఉక్కు-ఆంధ్రుల హ‌క్కు న్యాయ‌సాధ‌న స‌భలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌సంగించారు. భౌగోళికంగా విడిపోయినా తెలుగు వారిగా మ‌న‌మొక్క‌టేన‌ని, కురుక్షేత్రంలో కౌర‌వులు, పాండ‌వుల మ‌ధ్యే యుద్ధం జ‌రిగింద‌ని, కానీ వారిపైకి ఎవ‌రైనా వ‌స్తే వారు 105 మంది ఏక‌మై త‌మ హ‌క్కుల కోసం పోరాడార‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 32 మంది ప్రాణ త్యాగాల‌తో సాధించిన విశాఖ ఉక్కు క‌ర్మాగారాన్ని అదానీ కోసం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ విక్ర‌యిస్తుంటే ఇక్క‌డి ప‌హిల్వాన్లుగా చెప్పుకుంటున్న నాయ‌కులు ప్ర‌శ్నించ‌డం లేద‌ని రేవంత్ రెడ్డి విమ‌ర్శించారు. మ‌నం క‌లిసి పోరాడితే ఢిల్లీ సుల్తానులు, జాగీరార్దులు, పాల‌కులు ఎవ‌రైనా త‌ల‌వంచాల్సిందేన‌న్నారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నీలం సంజీవ రెడ్డి, పి.వి.న‌ర‌సింహారావు, ఎన్టీ రామారావు, వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి, జైపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు వంటి ఉద్ధండ నేత‌లు వివిధ స‌మ‌స్య‌ల‌పై కేంద్ర నేత‌ల‌ను నిల‌దీసి దేశ రాజ‌కీయాల‌ను శాసించార‌ని కొనియాడారు. ప్ర‌స్తుతం ప్ర‌శ్నించే నాయ‌కులే లేర‌ని, వంగి వంగి దండాలు పెట్టే నాయ‌కులు త‌యార‌య్యార‌న్నారు. బీజేపీ అంటే బాబు, జ‌గ‌న్‌, ప‌వ‌న్ అని, ఈ రాష్ట్రంలో మోదీకి బ‌లం వారేన‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇక్క‌డి ప్ర‌జ‌లు మేం ఆయ‌న‌కు ఓటేశాం, మేం ఈయ‌నకు ఓటు వేశాం అనుకోవ‌చ్చ‌ని, కానీ ఎవ‌రికి వేసినా అంతిమంగా ఆ ఓటు వెళ్లేది బీజేపీకేన‌ని గుర్తుంచుకోవాల‌న్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్ లేదు.. మీరు అక్క‌డ‌కు వెళ్ల‌వ‌ద్ద‌ని కొంద‌రు స‌న్నిహితులు త‌న‌కు సూచించార‌ని, కానీ వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి వార‌సురాలు ష‌ర్మిల స‌భ పెడితే ఆయ‌న అభిమానులు అండ‌గా నిలుస్తార‌ని భావించి తాను వ‌చ్చాన‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ స‌భ‌ను చూస్తుంటే కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌తో హైద‌రాబాద్‌లో స‌భ పెట్టిన‌ట్లుగా ఉంద‌ని, త‌న న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టినందుకు వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి అభిమానుల‌కు, కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌కు కృత‌జ్ఞ‌తలు తెలుపుతున్నాన‌న్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి కాంగ్రెస్‌కు అయిదు ఎంపీలు, శాస‌న‌స‌భ‌కు 25 మంది ఎమ్మెల్యేల‌ను పంపాల‌ని, చ‌ట్ట స‌భ‌ల్లో ప్రాతినిథ్యం వ‌హించే అవ‌కాశం కాంగ్రెస్ పార్టీకి క‌ల్పించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌జ‌ల‌కు విజ్ఙ‌ప్తి చేశారు. ఇక్క‌డ అచ్చోసిన అంబోతుల్లా ఆ ఇద్ద‌రు పోట్లాడుతుంటే కాంగ్రెస్‌కు ఎక్క‌డ అవ‌కాశం ఉంద‌ని అనుకోవ‌ద్ద‌ని, తెలంగాణ‌లోనూ ఒక ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ పార్టీకి కేవ‌లం 3,200 ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయ‌ని గుర్తు చేశారు. తెలంగాణ‌లోనూ మోడీ, కేడీ మ‌ధ్య తాము నిలిచి కొట్లాడినందునే శాస‌న‌స‌భ‌లో అయిదుగురు ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల్లో 65 స్థానాలు గెలిచి అధికారంలోకి వ‌చ్చింద‌న్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు తెలివైన వారు, విజ్ఙుల‌ని, సాఫ్ట్‌వేర్‌, ఫార్మా స‌హా అనేక రంగాల్లో ముందున్న వారు ఎన్నిక‌ల్లో తెలివైన నిర్ణ‌యం తీసుకోవాల‌ని, ప్ర‌శ్నించే గొంతుక‌ల‌ని గెలిపించాల‌ని కోరారు.