Khelo India 2026: ఖేలో ఇండియా-2026 ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. బ్రోచర్ విడుదల

Cm Revanth

Cm Revanth

ఖేలో ఇండియా-2026 క్రీడా పోటీల ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోటీలకు సంబంధించిన ‘ఖేలో ఇండియా-2026’ బ్రోచర్‌ను ఆయన అధికారికంగా విడుదల చేశారు. డిసెంబర్ 11 నుంచి 22 వరకు జరగనున్న ఈ క్రీడా పోటీల నిర్వహణపై సీఎం అధికారులకు పలు కీలక సూచనలు జారీ చేశారు. డిసెంబర్ 11న ఎల్బీ స్టేడియంలో ప్రారంభోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించాలని, అలాగే డిసెంబర్ 22న గచ్చిబౌలి స్టేడియంలో ముగింపు వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పోటీల సందర్భంగా నగరమంతా క్రీడా స్ఫూర్తి ఉట్టిపడేలా వాతావరణాన్ని తీర్చిదిద్దాలని, ఇందుకోసం పోలీస్, మున్సిపల్ విభాగాల అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం ఒక్కో విభాగానికి ఒక్కొక్కరిని ఇంచార్జులుగా నియమించి జవాబుదారీతనం కల్పించాలని సూచించారు.

జిల్లాల వారీగా పోటీల ఏర్పాట్లను పర్యవేక్షించే బాధ్యతలను మంత్రులకు అప్పగించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఇంచార్జ్ మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులతో సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లను పర్యవేక్షించాలని క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరికి సూచించారు. అలాగే మహబూబ్ నగర్ పరిధిలో జూపల్లి కృష్ణారావు, వరంగల్‌లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కరీంనగర్‌లో అడ్లూరి లక్ష్మణ్, ఖమ్మంలో తుమ్మల నాగేశ్వర్ రావు, నిజామాబాద్ పరిధిలో సుదర్శన్ రెడ్డిలకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలని తెలిపారు.

క్రీడా పోటీలకు హాజరయ్యే ఆహ్వానితులు, క్రీడాకారులకు అందించే ఆహారం, వసతి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. స్టేడియంల పునరుద్ధరణతో పాటు ఇతర ఏర్పాట్లలో నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని, క్వాలిటీ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. తెలంగాణలో క్రీడలను మరింతగా ప్రోత్సహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, మట్టిలో మాణిక్యాలను వెలికితీసి వారికి మెరుగైన శిక్షణ అందించేందుకు దేశంలోని అత్యుత్తమ కోచ్‌లను నియమించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.