CM Revanth Reddy: సూర్యాపేట జిల్లాలో వరద పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అధికారుల నివేదిక ప్రకారం 30 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైందని వెల్లడించారు. ప్రాణ, ఆస్తి, పంట నష్టం జరిగిందని.. ప్రజలకు విశ్వాసం కలిగించేందుకే తన పర్యటన అంటూ ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రాథమికంగా నష్టాన్ని అంచనా వేశారని, నివేదిక సమర్పించారని సీఎం తెలిపారు. సూర్యాపేట జిల్లాలో ఆస్తి, ప్రాణ, పంట నష్టానికి సంబంధించిన పూర్తి నివేదిక వచ్చిందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు క్షేత్ర స్థాయిలో ఉండి సహాయక చర్యలు తీసుకున్నారని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రౌండ్ లెవల్‌లో సమర్థవంతంగా పనిచేశారని.. వాళ్ళను అభినందిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని సహాయం చేయాలని అడిగామమన్నారు.
వరదల కారణంగా చనిపోయిన వారికి రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని.. పంటనష్టం జరిగిన రైతులకు ఎకరానికి రూ.10 వేలు పరిహారంగా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇల్లు కోల్పోయిన వారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన లేదా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. వరద బాధితులను ఆదుకోవడానికి కలెక్టర్‌కు రూ.5 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. గురుకులాలకు సెలవులు ఇచ్చే అధికారం కలెక్టర్‌కు ఇచ్చామన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రూ.10 లక్షలు సీఎం సహాయనిధికి అందించారని, వెంకయ్య నాయుడుకు తెలంగాణ ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలిపారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏం చేసిందో అందరికీ తెలుసని, ప్రజలు గమనిస్తున్నారని వెల్లడించారు. బురద రాజకీయాలు చేస్తే సహించమన్నారు. బెయిల్ కోసం ఢిల్లీకి పోతారు.. కానీ ప్రజలు కష్టాల్లో ఉంటే స్పందించరని మండిపడ్డారు.
Read Also: CM Revanth Reddy: వరద ముంపు ప్రాంతాలలో పర్యటించాలి.. ప్రధానికి సీఎం రేవంత్ లేఖ
కేంద్రంపై ఆధారపడకుండా ఎన్డీఆర్‌ఎఫ్‌కు సమాంతరంగా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. 8 బృందాలు ఒకొక్క బృందంలో 100మంది ఉంటారని.. అన్ని వసతులు, సౌకర్యాలు కల్పిస్తామన్నారు. పోలీస్ బెటాలియన్లు ఉన్నచోట దీన్ని ప్రారంభిస్తామన్నారు. తుఫాను నష్టాన్ని పరిశీలించడానికి ప్రధానమంత్రిని ఆహ్వానించామని సీఎం చెప్పారు. ఆర్థిక సాయం చేయాలని కేంద్రాన్ని కోరామన్నారు. 2 వేల కోట్ల రూపాయల పరిహారం వచ్చేలా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ప్రజలకు అండగా, అందుబాటులో ఉంటుందన్న సీఎం రేవంత్.. ప్రజలు ఆందోళన పడొద్దన్నారు. పూర్తి స్థాయిలో నష్టాన్ని భర్తీ చేస్తామని, క్షేత్రస్థాయిలో అధికారులు ఉండాలన్నారు. కచ్చితంగా నష్టాన్ని అంచనా వేయాలని సీఎం ఆదేశించారు.