కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఏం చేయనుందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును కూల్చివేస్తరా?, నిలిపివేస్తరా? లేదా కొనసాగిస్తరా? అనేది ప్రభుత్వం స్పష్టం చేయాలని కోరారు. జస్టిస్ పీసీ ఘోష్ రిపోర్టులో కాంట్రాక్టర్ల పేర్లు ఎందుకు లేవని, వారికి డ్యామ్ డ్యామేజీలో బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వాలకు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎటీఎంలుగా మారాయని ఫైర్ అయ్యారు. కాంట్రాక్టర్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకే బాండ్లు ఇస్తారని.. సీపీఐ, ఎంఐఎం పార్టీలకు ఇవ్వరని అక్బరుద్దీన్ పేర్కొన్నారు.
అసెంబ్లీలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మాట్లాడుతూ… ‘కమిషన్ నివేదికలో కాంట్రాక్టర్లపై చర్యలు లేవు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంట్రాక్టర్ల తమాషా ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి దగ్గర వీరే.. కేసీఆర్ దగ్గర వీరే.. ఇప్పుడు కూడా ఆ కాంట్రాక్టర్లే. కాంట్రాక్టర్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకే బాండ్లు ఇస్తారు.. సీపీఐ, ఎంఐఎం పార్టీలకు ఇవ్వరు. కమిషన్ కాంట్రాక్టర్లపై చర్యలు డిమాండ్ చేయకపోతే ఏం లాభం?. బడా కాంట్రాక్టర్లను వదిలేసి.. పేద కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వండి సీఎం గారు. యాక్షన్ టేకెన్ రిపోర్ట్ పెట్టలేదు, సభలోనే చర్చిద్దాం అని ప్రభుత్వం చెప్తుంది. ఎప్పుడైనా కేబినెట్లో మంత్రులు సిఫార్సు చేస్తారు. ఇప్పుడేమో విచిత్రంగా సభలో నిర్ణయం తీసుకుంటారు అంట. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు రిజెక్ట్ చేశారు. ఇప్పుడు మీరు సభలో నివేదిక పెట్టి ఏం చర్యలు తీసుకోవాలో చెప్పండి అంటున్నారు, బీఆర్ఎస్ ఏం చెప్తుంది?’ అని ప్రశ్నించారు.
Also Read: CM Revanth Reddy: రాళ్లతో కొట్టలేదు, నడి రోడ్డులో ఉరి వేయలేదు.. కేసీఆర్‌పై సీఎం ఫైర్!
ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ‘కమిషన్ అన్ని అంశాలు మెన్షన్ చేశారు. అక్బరుద్దీన్.. మీరు పొరపాటు పడుతున్నారు. నేను రిపోర్ట్ చదవకుండా చెప్పను. నేను పేజీ నెంబర్లతో సహా చెప్తున్నా. విజిలెన్స్ నివేదిక కూడా అధికారికంగా కమిషన్కి ఇచ్చాం. గంటన్నర మీరు మాట్లాడినా నేను సైలెంట్‌గా ఉన్నా. కానీ సభను మీరు తప్పుదోవ పట్టించేలా చేస్తున్నారు. మేము మీ సలహాలు కోరుతున్నాం, మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. ఇవ్వకున్నా మేము చర్యలు తీసుకుంటాం. చర్యలు ఎలా తీసుకోవాలో మాకు తెలుసు. అక్బరుద్దీన్.. మీరు నాకు మంచి దోస్తు. నాతో మజాకా చెయ్ కానీ ప్రభుత్వంతో చేయొద్దు. 8బి కింద జస్టిస్ నరసింహారెడ్డి నోటీసు ఇవ్వలేదు కాబట్టి చెల్లదు అని వాదించారు. ఇప్పుడు ఘోష్ నివేదికపై 8 బి కింద నోటీసులు ఇవ్వలేదు కాబట్టి చెల్లదు అంటున్నారు. అక్బరుద్దీన్ గారికి ఉన్నంత నాలెడ్జీ లేకపోవచ్చు కానీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే ఓపిక ఉంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై మీ సలహా ఏంటో చెప్పండి. రాత్రి 12 అయినా ఎందుకు సభలో ఉన్నాం చేయాలనే కదా.. మేము చేయలేక కాదు’ అని సీఎం అన్నారు.
