Site icon NTV Telugu

CM Revanth Reddy: రాష్ట్రంలో కొత్తగా మరో డిస్కమ్ ఏర్పాటుకు రేవంత్ సర్కార్ నిర్ణయం..

Cm Revanth Reddy

Cm Revanth Reddy

రాష్ట్రంలో విద్యుత్ విభాగం ప్రక్షాళన చేసేందుకు అవసరమైన సంస్కరణలు అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో కొత్తగా మరో డిస్కమ్ ఏర్పాటు చేయాలని, అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. Npdcl, Spdcl తో పాటు కొత్తగా ఏర్పాటు చేసే డిస్కమ్ కు వ్యవసాయ ఉచిత విద్యుత్, 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్, స్కూళ్ళు కాలేజీలకు ఉచిత విద్యుత్ పథకాలన్ని కొత్త డిస్కమ్ పరిధిలోకి తీసుకు రావాలని సూచించారు. రాష్ట్రమంతా ఒకే యూనిట్ గా కొత్త డిస్కమ్ పరిధి ఉండాలని ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. దీంతో ఇపుడున్న డిస్కమ్‌ల పనితీరు మెరుగుపడుతుందని, జాతీయ స్థాయిలో రేటింగ్ పెరుగుతుందని అన్నారు. డిస్కమ్‌ల ఆర్థిక స్థితి గతులను మెరుగుపరిచేందుకు సంస్కరణలు తప్పనిసరని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. డిస్కమ్‌ల పునరవ్యవస్తీకరణతో పాటు విద్యుత్ సంస్థలపై ఇప్పుడు ఉన్న రుణ భారం తగ్గించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.

READ MORE: WCL 2025: డబ్ల్యూసీఎల్ టోర్నీ నుంచి భారత్ అవుట్.. ఫైనల్‌కు దూసుకెళ్లిన పాకిస్థాన్‌!

రుణాలపై వడ్డీ భారం తగ్గించేందుకు వెంటనే ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. 10 శాతం వరకు వడ్డీ పై తీసుకున్న రుణాలతో డిస్కమ్ లు డీలా పడ్డాయని.. ఈ రుణాలను తక్కువ వడ్డీ ఉండేలా రీ స్ట్రక్చర్ చేసుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ విద్యుత్ వినియోగాన్ని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేయాలని, జిల్లాలవారీగా అనువైన భవనాలను గుర్తించే బాధ్యతను ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగించాలని అధికారులకు సూచించారు. యుద్ధ ప్రాతిపదికన అందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఇంధన శాఖపై జూబ్లీహిల్స్ నివాసంలో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, TG GENCO సీఎండీ హరీష్, TG SPDCL సీఎండీ ముషారఫ్, TG NPDCL సీఎండీ వరుణ్ రెడ్డి, సింగరేణి సీఎండీ బలరాం, TGREDCO VC&MD అనిల్, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశం లో పాల్గొన్నారు.

Exit mobile version