NTV Telugu Site icon

CM Revanth Reddy: కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

Revanth Reddy

Revanth Reddy

CM Revanth Reddy: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక విషయాలపై చర్చించారు. సీఎం రేవంత్‌ వెంట కడియం కావ్య, చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితర ఎంపీలు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలోని వివిధ రక్షణ శాఖ భూముల బదలాయింపుపై విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కోసం రక్షణ శాఖ భూమిని అప్పగించాలని కేంద్ర మంత్రిని కోరారు. అలాగే, కరీంనగర్, రామగుండం కనెక్టివిటీ కోసం రక్షణ శాఖ భూముల అప్పగింతపై కూడా విజ్ఞప్తి చేశారు.

Read Also: Damodar Raja Narasimha: జూడాలతో మంత్రి చర్చలు అసంపూర్ణం.. కొనసాగుతున్న సమ్మె

హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ ర‌ద్దీని నివారించేందుకు మెహిదీప‌ట్నం రైతు బ‌జార్ వ‌ద్ద స్కైవాక్ నిర్మిస్తున్నామ‌ని, ఇందుకోసం అక్కడ ఉన్న ర‌క్షణ శాఖ భూమి 0.21 హెక్టార్లను బ‌దిలీ చేయాల‌ని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు.. ఆ భాగంలో మిన‌హా స్కైవే నిర్మాణం పూర్తి కావ‌స్తున్నందున ఆ భూమిని వెంట‌నే బ‌దిలీ చేయాల‌ని విజ్ఞప్తి చేశారు. హైద‌రాబాద్ నుంచి క‌రీంన‌గ‌ర్‌-రామ‌గుండం ను క‌లిపే రాజీవ్ ర‌హ‌దారిలో ప్యార‌డైజ్ జంక్షన్ నుంచి అవుట‌ర్ రింగు రోడ్డు జంక్షన్ వ‌ర‌కు ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం, ఎంట్రీ, ఎగ్జిట్ ర్యాంపుల నిర్మాణానికి మొత్తంగా 11.30 కిలోమీట‌ర్ల కారిడార్ నిర్మాణానికి 83 ఎక‌రాల ర‌క్షణ శాఖ భూమి అవ‌స‌ర‌మ‌ని దానిని రాష్ట్ర ప్రభుత్వానికి బ‌దిలీ చేయాల‌ని ర‌క్షణ శాఖ మంత్రిని కోరారు.

నాగ్‌పూర్ హైవే (ఎన్‌హెచ్‌-44)పై కండ్లకోయ స‌మీపంలోని ప్యార‌డైజ్ జంక్షన్ నుంచి అవుట‌ర్ రింగ్ రోడ్డు వ‌ర‌కు ఎలివేటెడ్ కారిడార్ మొత్తంగా 18.30 కిలోమీటర్ల మేర ప్రతిపాదించామ‌ని, అందులో 12.68 కిలోమీట‌ర్ల మేర ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి, నాలుగు ప్రాంతాల్లో ఎగ్జిట్, ఎంట్రీల‌కు, భ‌విష్యత్తులో డ‌బుల్ డెక్కర్ (మెట్రో కోసం) కారిడార్‌, ఇత‌ర నిర్మాణాల‌కు మొత్తంగా 56 ఎక‌రాల ర‌క్షణ శాఖ భూములు బ‌దిలీ చేయాల‌ని ర‌క్షణ శాఖ మంత్రికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. అలాగే, కొన్ని జిల్లాల్లో సైనిక్ స్కూల్స్ పెంపు కోసం విజ్ఞప్తి చేశారు. సాయంత్రం 6.15 గంటలకు గృహ నిర్మాణ శాఖ మంత్రి ఖట్టర్‌ను ముఖ్యమంత్రి కలవనున్నారు.