CM Revanth Reddy: భారత సైన్యం నిర్వహించిన “ఆపరేషన్ సిందూర్”కు సంఘీభావంగా హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించబడింది. ఈ సంఘీభావ ర్యాలీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా హాజరయ్యారు. సెక్రటేరియట్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో సీఎం తన భుజాన జాతీయ జెండా వేసుకొని పాల్గొనడం విశేషం. ర్యాలీలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని అక్కడి నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వరకు కొనసాగింది. టెర్రరిస్టుల దాడిలో అమరులైన సైనికులకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, అధికారులు నివాళులు అర్పించారు. అనంతరం ఒక నిమిషం పాటు మౌనం పాటించారు.
Read Also: Operation Sindoor: టెర్రరిస్ట్ అబ్దుల్ రౌఫ్ అజార్ హతం.. యూఎస్ జర్నలిస్ట్ హత్యకు భారత్ ప్రతీకారం..
ర్యాలీ సందర్బంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మన ఆడబిడ్డల నుదిటి సింధూరాన్ని తుడిచిన ఉగ్రవాదులకు భారత సైన్యం గట్టి గుణపాఠం చెప్పింది. భారతదేశ ప్రజలంతా ఒక్కటే. దేశ సార్వభౌమాధికారంపై దాడి చేస్తే, దాడి చేసిన వారికి భూమి మీద నూకలు ఉండవని స్పష్టం చేశారు. ఎన్నికలు ఉన్నప్పుడు రాజకీయాలు వేరే విషయం. కానీ, ఉగ్రవాదంపై పోరాటంలో దేశం ఏకం. రాహుల్ గాంధీ స్వయంగా ప్రధాని మోదీని కలిసి ఉగ్రవాదులపై చర్యలు తీసుకోండి, మా మద్దతు మీకు ఉంటుంది అని అన్నారని తెలిపారు. మా శాంతి స్వరూపాన్ని చేతగానితనంగా భావించకూడదు. అటువంటి శక్తులకు సమాధానం ఆపరేషన్ సిందూర్ అని అన్నారు. ఈ సంఘీభావ ర్యాలీ దేశభక్తి, ఐక్యతకు ప్రతీకగా నిలిచింది. ఉగ్రవాదంపై పోరాటంలో తెలంగాణ రాష్ట్రం సైన్యానికి పూర్తి మద్దతుగా ఉందని ఈ ర్యాలీ ద్వారా తేల్చి చెప్పింది.