Site icon NTV Telugu

Elevated Corridor: రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి శంకుస్థాపన

Revanth Reddy

Revanth Reddy

Elevated Corridor: సికింద్రాబాద్ అల్వాల్ టిమ్స్ సమీపంలో రాజీవ్ రహదారి(SH01) ఎలివేటెడ్ కారిడార్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. రాజీవ్ రహదారి ఎలివేటేడ్ కారిడార్ పూర్తయితే మేడ్చల్, కుత్బుల్లాపూర్, కరీంనగర్, ఆదిలాబాద్ ప్రయాణం సులభతరం అవుతుందని ఆయన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణతో ఈ ప్రాజెక్టు ఆలస్యమైందన్నారు. ప్రజల అవసరాన్ని మర్చిపోయి గత ప్రభుత్వం కేంద్రంతో గిల్లికజ్జాలు పెట్టుకుని ప్రాజెక్టును పక్కనబెట్టిందన్నారు. మేం అధికారంలోకి రాగానే కేంద్రంతో మాట్లాడి సమస్యను పరిష్కరించామన్నారు. ప్రధాని మోదీని, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ ను కలిసి ప్రాజెక్టు అవసరాన్ని వివరించామని సీఎం చెప్పారు.

Read Also: Harish Rao: సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలకు హరీష్‌ రావు కౌంటర్‌

భూముల కేటాయింపు, చాంద్రాయణగుట్ట రక్షణ శాఖ భూముల లీజ్ రెన్యూవల్ చేయకుండా గత ప్రభుత్వం జాప్యం చేసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారంలోకి రాగానే తక్షణమే మేం అధికారులతో సమీక్షించి రక్షణ శాఖకు భూములు అప్పగించామన్నారు. ఎలివేటేడ్ కారిడార్ పూర్తయితే మేడ్చల్ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడంతో కేంద్రం రాష్ట్రానికి సహకరించిందన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ దిక్కుమాలిన విధానాలతో ప్రజలకు శిక్ష పడిందని విమర్శించారు. ఉత్తర తెలంగాణ అభివృద్ధి చెందాలంటే ఎలివేటేడ్ కారిడార్ పూర్తవ్వాలన్నారు. ప్రజల అవసరాల కోసమే ఒక మెట్టు దిగా.. రాజకీయాల కోసం కాదన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో హైదరాబాద్‌లో ఏదైనా ఒక శాశ్వత అభివృద్ధి చేశారా అంటూ ఆయన ప్రశ్నించారు. ఈ నగరంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది కాంగ్రెస్ పాలనలోనేనని సీఎం తెలిపారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో గంజాయి, డ్రగ్స్, పబ్బులు తప్ప ఏం రాలేదని విమర్శలు గుప్పించారు.

Read Also: Half Day Schools: మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు.. సర్క్యులర్ జారీ

ఈ ఎలివేటేడ్ కారిడార్ ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ముఖద్వారమని.. అభివృద్ధి కోసం భవిష్యత్‌లోనూ కేంద్రాన్ని అడుగుతూనే ఉంటామన్నారు. కేంద్రం సహకరించకపోతే కొట్లాడుతామన్నారు. ఈ నగరాన్ని అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు.. ఎన్నికలు ముగిశాక అభివృద్ధి మా లక్ష్యమన్నారు. రాబోయే రోజుల్లో కంటోన్మెంట్ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తాం.మా పోరాటం ఫలించిందని కేటీఆర్ అంటుండు.. ఏం పోరాటం చేశారని ప్రశ్నించారు. ట్విట్టర్ లో పోస్టులు పెట్టుడా అంటూ ఎద్దేవా చేశారు. మేం అనుమతులు తీసుకొస్తే ఆయన పోరాటం అని చెప్పుకుంటారన్నారు. ఈ వేదికగా కేటీఆర్‌కు సూచన చేస్తున్నానన్న రేవంత్.. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ఇందిరా పార్కు వద్ద కేటీఆర్ ఆమరణ దీక్ష చేయాలన్నారు. కేటీఆర్ చచ్చుడో అభివృద్ధికి నిధులు వచ్చుడో తేలే వరకు దీక్ష చేయాలన్నారు. ఆయన దీక్షకు దిగితే మా కార్యకకర్తలే ఆయన్ను కంచె వేసి కాపాడుతారన్నారు.

Exit mobile version