Site icon NTV Telugu

CM Revanth Reddy: నాటి సాయుధ పోరాట స్ఫూర్తితోనే.. ఇప్పుడు ప్రజాపాలన సాధించుకున్నాం..

Cm Revanth

Cm Revanth

తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాయి కాంగ్రెస్ శ్రేణులు. పబ్లిక్‌ గార్డెన్‌లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ..తెలంగాణ ప్రజాస్వామ్య చరిత్రకు శ్రీకారం చుట్టిన శుభదినం ఈ రోజు.. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే రాసుకున్న పోరాట చరిత్ర మనది.. నిజాం నియంతృత్వంపై సామాన్యుడు సాయుధ పోరాటంతో సాధించుకున్న విజయం ఈ రోజు మనం అనుభవిస్తోన్న ప్రజాస్వామ్యం.. ప్రపంచఉద్యమాల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘనత తెలంగాణ సాయుధ పోరాటానిది 1948, సెప్టెంబర్ 17… ఈ పోరాటంలో ప్రజలు విజయం సాధించి, స్వేచ్ఛాపతాకను ఎగుర వేసిన రోజు.. ఈ గడ్డపై రాచరికానికి గోరీ కట్టి… ప్రజా పాలనకు హారతి పట్టిన రోజు సెప్టెంబర్ 17.. అందుకే ఇది ప్రజా పాలన దినోత్సవం.. రాష్ట్ర ప్రజలందరికీ ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు.

Also Read:Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి దగ్గర ఉద్రిక్తత..

స్వేచ్ఛ మన జీవన విధానం.. ఆ స్వేచ్ఛా సాధనకు ప్రాణ త్యాగాలకు సైతం వెనుకాడని జాతి మనది.. అణచివేత, పెత్తందారీతనం, నియంతృత్వం, బానిసత్వం సంకెళ్లను బద్ధలు కొట్టి స్వేచ్ఛకు ఊపిరి పోయడానికి ఊపిరి వదిలిన వందలాది మంది అమరులకు ఈ సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను.. సెప్టెంబర్ 17, 1948 తెలంగాణ చరిత్రలో ఒక మైలురాయి.. అదే విధంగా డిసెంబర్ 7, 2023 స్వరాష్ట్ర ప్రజాస్వామ్య ప్రస్థానంలో మరోమైలు రాయి.. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో మొదలైన స్వరాష్ట్ర ప్రస్థానం తిరిగి మళ్లీ నియంతృత్వ నిర్భందంలోకి జారి పోయిన తీరు గడచిన పదేళ్లలో మనం చూశాం.. నాటి సాయుధ పోరాట స్ఫూర్తితో నిన్నటి నియంతృత్వ పాలనను ఓడించి, ప్రజా పాలనను తెచ్చుకున్నాం.

అందుకే డిసెంబర్ 7, 2023 కూడా ఒక ఛారిత్రక సందర్భంగా భవిష్యత్ తరాలకు గుర్తుండి పోతుందని నేను భావిస్తున్నాను.. 77 ఏళ్ల తెలంగాణ ప్రస్థానాన్ని, పోరాట చరిత్రను, ఇక్కడ ఉద్భవించిన ఉద్యమాల సరళిని సంపూర్ణంగా ఆకళింపు చేసుకుని, ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుని మేం ఈ రోజు పరిపాలన చేస్తున్నాం.. అహంకారపు ఆలోచనలు, బంధు ప్రీతి, ఆశ్రిత పక్షపాతానికి మా పాలనలో తావు లేదు.. కష్టమైనా, నష్టమైనా ప్రజలతో పంచుకుంటున్నాం. ప్రజల ఆకాంక్షలు, వారి ఆలోచననే ప్రమాణికంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం.. తీసుకున్న నిర్ణయాలలో మంచి చెడులను విశ్లేషించే అవకాశం ఇస్తున్నాం.. తప్పులుంటే దిద్దుకుంటున్నాం. మంచి చేయడమే బాధ్యతగా భావిస్తున్నాం.

అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడాలన్న తపనతో పని చేస్తున్నాం.. ప్రతి పేదవాడి మొఖంలో ఆనందమే లక్ష్యంగా సంక్షేమ చరిత్రను తిరగ రాస్తున్నాం.. ఏడు దశాబ్ధాలుగా తెలంగాణ ఆశిస్తోన్న స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమానత్వమే మా ప్రభుత్వ ప్రథామిక ఎజెండా.. అభివృద్ధిలోనే కాదు… స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం విషయంలో కూడా తెలంగాణ దేశానికి రోల్ మోడల్ గా ఉంటుంది.. విద్యనే మన విజయానికి వజ్రాయుధం అని మేం నమ్ముతున్నాం.. గొప్ప విజన్ తో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్ల ఆలోచన చేశాం.. భవిష్యత్ లో తెలంగాణ విద్య వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు ఈ స్కూళ్లు కేంద్రాలుగా మారబోతున్నాయి.. విద్యపై మేం చేస్తున్న వ్యయం ఖర్చు కాదు.. భవిష్యత్ తెలంగాణకు పెట్టుబడిగా మేం భావిస్తున్నాం.

విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇన్నోవేషన్ కు పెద్దపీట వేస్తున్నాం.. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలు రేపటి తెలంగాణ భవితకు భరోసా కేంద్రాలుగా నిలుస్తాయి.. రాష్ట్ర విద్యా పాలసీని త్వరలో తీసుకురాబోతున్నాం.. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి వంటి తెలంగాణ వీర వనితలు పోరాటంలో ముందుడి నాయకత్వ పఠిమను చాటారు..మహిళా ఉన్నతి-తెలంగాణ ప్రగతి” నినాదంతో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో మేం చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి.. ఇందిరా మహిళాశక్తి పాలసీలో భాగంగా నారాయణపేట జిల్లాలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్‌ బంక్‌ ద్వారా ఆరు నెలల్లో రూ.15.50 లక్షల లాభాలు ఆర్జించంది.. ఖమ్మం “మహిళా మార్ట్” విజయవంతంగా నడుస్తోంది.

రాష్ట్రంలో మరికొన్ని మహిళ మార్ట్ లను ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నాం.. హరిత విప్లవం నుండి ఉచిత విద్యుత్ వరకు, రుణమాఫీ నుండి రైతు భరోసా వరకు రైతుల కోసం మనం రూపొందించిన సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు కొత్త చరిత్రను సృష్టిస్తున్నాయి.. రాష్ట్రంలోని 25.35 లక్షల మంది రైతులకు, రూ.20,616 కోట్ల రుణాలు మాఫీ చేసి దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా రైతులను ఆదుకున్నాం.. ఇందిరమ్మ రైతు భరోసా కింద తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేసి పెట్టుబడికి భరోసా ఇచ్చాం.. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా రైతుల సంక్షేమం విషయంలో రాజీ పడలేదు..

కేవలం ఏడాది కాలంలో లక్షా నాలుగు వేల కోట్ల రూపాయలు రైతుల ప్రయోజనాలపై ఖర్చు చేసిన ప్రభుత్వం ఈ దేశంలో మరొకటి లేదు. 7,178 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల వద్ద చివరి గింజ వరకు ధాన్యం కొన్నాం.. సన్నాలకు క్వింటాల్ కు రూ.500 బోనస్‌ ఇస్తున్నాం.. రాష్ట్రంలోని 29 లక్షల వ్యవసాయ మోటార్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. దీని కోసం రూ.16,691 కోట్ల సబ్సిడీని విద్యుత్తు సంస్థలకు చెల్లిస్తున్నాం..గత ఏడాది 2.90 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తితో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచాం.

ఈ ఏడాది 280 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తితో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాం.. ప్రజా ప్రభుత్వం తొలి 20 నెలల్లోనే ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా సుమారు 60 వేల ఉద్యోగాల భర్తీ చేశాం.. రాజీవ్ గాంధీ సివిల్స్ ఆభయ హస్తం ద్వారా లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాం.. సివిల్స్ మెయిన్స్‌కు ఎంపికైన 180 మందికి తెలంగాణ అభ్యర్థులకు ఆగస్టు 11న ఈ ఆర్థిక సహాయం అందించాం.. ఆర్థిక సహాయం పొందిన వారిలో ఇప్పటి వరకు 10 మంది అఖిల భారత సర్వీసులకు ఎంపిక కావడం తెలంగాణకు గర్వకారణం.. భూ పోరాటాల చరిత్రనే తెలంగాణ చరిత్ర. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి కారణంగా తెలంగాణ రెవెన్యూ వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తమైంది.. తమ దోపిడీకి అడ్డుగా ఉన్నారనే రెవెన్యూ ఉద్యోగులను, సిబ్బందిని దొంగలుగా, దోపిడీదారులుగా గత పాలకులు ముద్ర వేశారు.

భూ భారతి చట్టం తెచ్చాం.క్షేత్ర స్థాయిలో ఈ చట్టాన్ని సమర్ధవంతంగా అమలు చేసేందుకుఇటీవలే 5 వేల మంది గ్రామ పాలనా అధికారులను నియమించాం.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు గ్రామాల్లో పేదల ఆత్మగౌరవ ప్రతీకలు.. కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని బెండలపాడు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ మహోత్సవంలో పాల్గొన్నప్పుడు ఆ పేదల కళ్లలో చూసిన ఆనందం నాకు ఎనలేని తృప్తిని ఇచ్చింది.. తొలి విడతగా 22,500 కోట్ల రూపాయలతో, ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం.. ఈ ఒక్క ఏడాదిలోనే నాలుగున్నర లక్షల మంది పేదలు సొంత ఇంటివారవుతున్నారు.. సన్నబియ్యం సంక్షేమ పథకానికి ఈ రోజు కేరాఫ్ అడ్రస్ తెలంగాణ.. దేశంలో మరే రాష్ట్రంలో ఇటువంటి పథకం లేదు.. రాష్ట్రంలోని 3.10 కోట్ల మందికి నిత్యం సన్నబియ్యంతో ఈ రోజు భోజనం చేయగలుగుతున్నారు.

కృష్ణా, గోదావరి నదులు తెలంగాణ జీవనాడులు. ఆ నదుల్లో మనకు హక్కుగా దక్కాల్సిన నీటి వాటాలపై రాజీ పడేది లేదు.. గత పాలకుల తప్పులను సరిదిద్ది, ప్రతి చుక్క నీటిపై పక్కా హక్కులు సాధించే దిశగా కృష్ణా జలాల విషయంలో న్యాయ పోరాటానికి సిద్ధమయ్యాం.. కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన 904 టీఎంసీల వాటాను సాధించి తీరేలా వ్యూహరచన చేస్తున్నాం.. గత పాలకుల నిర్లక్ష్యంతో జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తూనే… శాశ్వత హక్కుల సాధనలో విజయం సాధించేలా పని చేస్తున్నాం.. 2027 డిసెంబర్ 9 నాటికి ఎస్‌ఎల్‌బీసీని (శ్రీశైలం లెఫ్ట్‌ బ్యాంక్‌ కెనాల్‌) ప్రజలకు అంకితం చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం.. హైదారాబాద్ మహానగరం మన బలం.. మన బ్రాండ్. ఈ బ్రాండ్ ను భవిష్యత్ లో ప్రపంచ వేదికపై సగర్వంగా నిలబెట్టే దీర్ఘ కాలిక ప్రణాళికలు రచిస్తున్నాం.

2035 నాటికి తెలంగాణ ఒక ట్రిలియన్ డాలర్ ఎకానమీగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ప్రపంచానికి హైదరాబాద్ గేట్ వే గా మారుతుంది.. ఆ దిశగా మొత్తం రాష్ట్రానికి మేం మాస్టర్ ప్లాన్ ను తయారు చేస్తున్నాం.. రోడ్లు, విద్యుత్, రహదారులు, రవాణా సదుపాయాలు, మురుగు నీటి పారుదల, వాతావరణ స్వచ్ఛత ఇలా అన్నీ కోణాల్లో అత్యంత స్వచ్ఛమైన, సుఖమైన జీవన ప్రమాణాలతో కూడిన నగరంగా హైదరాబాద్ ను మార్చాలి.. లక్షల కోట్ల అంతర్జాతీయ పెట్టుబడులకు హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది.. గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ)కు హబ్‌గా మారుతోంది.. హైదరాబాద్ నగరానికి వచ్చే వందేళ్ల తాగునీటి అవసరాలకు శాశ్వత పరిష్కారంగా గోదావరి జలాలు తీసుకువస్తున్నాం.

7360 కోట్ల రూపాయలతో గోదావరి 2,3 దశల పనులను ఇటీవలే ప్రారంభించుకున్నాం.. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు, గాంధీ సరోవర్ ప్రాజెక్టు ఉండబోతున్నాయి.. ఓఆర్‌ఆర్‌పై తలపెట్టిన గేట్ వే ఆఫ్ హైదరాబాద్ ఒక గొప్ప స్వాగత తోరణంగా నిలుస్తుంది.. 24 వేల కోట్ల రూపాయల అంచనాతో మెట్రో రెండవ దశ విస్తరణ ప్రాజెక్టును చేపడుతున్నాం. ఇప్పుడున్న 69 కిలోమీటర్ల మెట్రో మార్గానికి అదనంగా రెండో దశలో 76.4 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణం జరుగుతుంది.. గడచిన పదేళ్లలో హైదరాబాద్ నగరం డ్రగ్స్ కు గేట్ వేగా మారింది.. విచ్చలవిడిగా డ్రగ్స్ లభ్యతకు మన నగరం వేదిక కావడం అత్యంత దురదృష్టం..

ఆ భూతాన్ని కూకటి వేళ్లతో పెకిలించేందుకు ఈగల్ వ్యవస్థను తెచ్చాం.. 138 దేశాలు పాల్గొన్న ‘వరల్డ్ పోలీస్ సమిట్’ (డబ్ల్యూపీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) 2025లో డ్రగ్ కంట్రోల్ కేటగిరీలో మన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రథమ బహుమతి అందుకోవడం మనకు గర్వకారణం.. డ్రగ్స్ అనే మాట తెలంగాణలో వినబడటానికి వీలు లేదు. ఆ దిశగా అవసరమైతే మరింత కఠిన చట్టాలు తెస్తాం.. డ్రగ్స్ విషయంలో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు.. 2047 నాటికి భారతదేశ ముఖచిత్రాన్ని మార్చే గేమ్ ఛేంజర్ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్న సంకల్పం మాది.

ఆ సంకల్పానికి దార్శనిక పత్రమే ‘తెలంగాణ రైజింగ్‌ 2047’.. ఇది కేవలం ప్రణాళిక కాదు. ప్రపంచ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలబెట్టే సంకల్పం.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచడంలో కీలకమైన పలు ప్రతిపాదిత ప్రాజెక్టుల వెనుక ఉన్న ఆలోచన, ఆవిష్కరణ, ఆచరణ మార్గాలను ఈ విజన్ డాక్యూమెంట్ ప్రకటిస్తుంది.. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమయ్యే భారత్ ఫ్యూచర్ సిటీ… ఆధునిక ప్రపంచానికి గేట్ వేగా ఏ విధంగా ఉంటుందో ఈ పత్రం వెల్లడిస్తుంది.. రీజినల్ రింగ్ రోడ్డు రాష్ట్ర అభివృద్ధికి రాచమార్గంగా ఎలా నిలవబోతోందో తెలంగాణ రైజింగ్ – 2047 లో విస్పష్టంగా చెబుతాం..

Also Read:Aarogyasri: తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్.. సామాన్య ప్రజల అవస్థలు!!

గాంధీ సరోవర్ ప్రాజెక్టు, గ్రీన్ ఫీల్డ్ హైవేలు, డ్రైపోర్టులు, మెట్రో రెండో దశ విస్తరణ ప్రాజెక్టులు, ఔటర్ నుండి రీజినల్ రింగ్ రోడ్డు మధ్య నిర్మించే రేడియల్ రోడ్లు, వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలు, హైదరాబాద్ -నాగపూర్, హైదరాబాద్-బెంగుళూరు, హైదరాబాద్-విజయవాడ పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుతో తెలంగాణ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చే ప్రణాళిక తెలంగాణ రైజింగ్ – 2047.. ఈ సంకల్ప పత్రాన్ని కార్యచరణలో పెట్టి 2047 నాటికి దేశ ప్రగతిలో తెలంగాణది కీలక పాత్రగా చేయడమే మా సంకల్పం.. మా సంకల్పానికి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆశీస్సులు కావాలి. సాయుధ పోరాట స్ఫూర్తితో మొదలైన మన ప్రయాణం.. ప్రపంచ వేదికపై తెలంగాణ జెండా ఎగిరే స్థాయికి చేరాలి. ఆ బాధ్యత మాది. మాకు సహకరించి, ఆశీర్వదించే బాధ్యత ప్రజలది అని తెలిపారు.

Exit mobile version