CM Revanth Reddy : ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. ప్రముఖ ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అడ్డా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ఈ దఫా 400 సీట్లు అన్న వారు… 240 సీట్లు సాధించారు… కాంగ్రెస్ 40 నుంచి వందకు చేరింది.. నెంబర్లు చూస్తే ఎవరు గెలిచారో తెలుస్తుంది. ఇది బీజేపీ ఓటమి కాదు.. మోడీఓటమి. ప్రతి దానికి మోడీముద్ర వేశారు.. మోడీగ్యారంటీ అన్నారు… మోడీగ్యారంటీకి సంబంధించిన వారంటీ పూర్తయిందని నేను ఎన్నికలకు ముందే చెప్పాను. ఇప్పుడు నాయుడు, నితీశ్ కొందరి సహకారంతో ప్రభుత్వం నడుస్తోంది.. ఇది మోడీఓటమే.’ అన్నారు.
‘సర్కార్ ఏర్పాటు చేయడమే కాదు.. పదేళ్లలో మోడీఈ దేశ ప్రజలను ఎలా మోసం చేశారో చెప్పగలిగాం. అన్నదాతలకు వ్యతిరేకంగా పని చేశారు.. రాజ్యాంగం రద్దుకు మోడీప్రభుత్వం ఎలా ప్రయత్నించింది మేం చెప్పగలిగాం.. బీజేపీ రహస్య జెండాను బయటపెట్టాం.. బీజేపీ రహస్య అజెండా వేరు.. ఎన్నికల ముందు చెప్పే అజెండా వేరు..’ అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.
* కాంగ్రెస్ గత అయిదు నెలల్లో ఏం నేర్చుకుంది…?
రేవంత్ రెడ్డి: నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా… కాంగ్రెస్ ఫార్మాట్ మార్చుకోవాలి… కాంగ్రెస్ నాయకులు టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నారు… ఇప్పుడు 20-20 ఫార్మాట్ నడుస్తోంది. మేం ఫార్మాట్ ఆడాలి. లేదా ఫార్మాట్ మార్చుకోవాలి.. బీజేపీ ఉంచడమో.. ఖతం చేయడమో తీరులో ఉంటుంది. మాకు మానవీయ స్పర్శ ఉంటుంది. మేం అలా చేయం.. అవసరాలు.. వ్యాపార రీతిలో బీజేపీ రాజకీయాలు ఉంటాయి.. కాంగ్రెస్ తాతతండ్రులను గుర్తుపెట్టుకుంటుంది.. వారి సంక్షేమానికి కృషి చేస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు.
* ఆ కుటుంబం అన్ని త్యాగాలు చేసినా ఓటర్లు ఎందుకు కాంగ్రెస్ వైపు మొగ్గడం లేదు..?
రేవంత్ రెడ్డి: తరాల అంతరం..(జనరేషన్ గ్యాప్).. గతంలో అమ్మమ్మనానమ్మలు వంట చేసేంత వరకు రెండు మూడు గంటలు వెయిట్ చేసేవాళ్లం.. లేదా మంచి హోటల్‌కు వెళ్లేవాళ్లం.. ఇప్పుడు స్విగ్గీలో అర్డర్ ఇస్తే రెండు నిమిషాల్లో ఆర్డర్ వస్తోంది.. మనం అమ్మ, అమ్మమ్మ, నానమ్మలపై ఆధారపడడం లేదు.. స్విగ్గీపై ఆధారపడుతున్నాం.. ఇప్పడు రాజకీయాల్లోనూ స్విగ్గీ రాజకీయాలు ఎక్కువయ్యాయి… సరళీకరణ (లిబరలైజేషన్) తర్వాత సిద్ధాంతపరమైన రాజకీయాలు, ఆలోచనలు, అనుసంధానత తగ్గిపోయింది. సరళీకరణ తర్వాత మాకు ఎంత త్వరగా ఉద్యోగం వస్తుంది.. ఎంత త్వరగా సంపాదిస్తాం అని ఆలోచిస్తున్నారు. మేం విద్యార్థులుగా ఉన్నప్పుడు మేమే వాల్ రైటింగ్ చేసేవాళ్లం..జెండాలు కట్టేవాళ్లం.. ప్రదర్శనలకు (ర్యాలీ) వెళ్లేవాళ్లం… మా జేబులోని డబ్బులు ఖర్చుపెట్టుకొని పని చేసేవాళ్లం.. కానీ ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది.. ముఖ్యమంత్రిగా, మాజీ పీసీసీ అధ్యక్షునిగా ఉన్న నేను ఎక్కువగా చెప్పకూడదు.. మీరే చెప్పండి.. మీరే అర్ధం చేసుకోండి.. ఎందుకు అదంతా మారింది. దానికి బాధ్యత బీజేపీ.. బీజేపీ తప్పిదాలు.. భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా వారు లబ్ధిపొందుతున్నారు… ఎన్నికల ముందు పుల్వామా, అయోధ్య రామమందిరం.. ఇలా ఏదో ఒక భావోద్వేగం రెచ్చగొడుతున్నారు.. బీజేపీకి జాతీయ ప్రయోజనాల కన్నా భావోద్వేగ రాజకీయాలు చేయడం తెలుసు…
* రాజకీయాలు భావోద్వేగాలతో ముడిపడినవి.. వాటిని ఎలా అధిగమిస్తారు..?
రేవంత్ రెడ్డి: మీరు మూడో తరం పాత్రికేయుడు.. రామ్‌నాథ్ గోయెంకా… ఆనంద్ గోయెంకా.. తర్వాత మీరు.. మీరే చెప్పండి.. మీకు విస్తృతమైన అనుభవం ఉంది. అటువంటి వాటిని ఎలా అధిగమించవచ్చో చెప్పండి.. మీ కుటుంబం దేశానికి సేవ, త్యాగాలు చేసింది.. మీరే మాకు, దేశానికి సూచించండి.. అవకాశాల్లో ప్రతి ఒక్కరూ సమానమే.. ప్రతి ఒక్కరూ సంక్షేమం, అభివృద్ధిని ప్రభుత్వం నుంచి ఆశిస్తారు.. మమ్మల్ని విస్మరించే వాళ్లు మాకు అవసరం లేదంటారు.. రాజకీయాల్లో రెండు భాగాలున్నాయి. రామ్‌నాధ్ గోయెంకా నుంచి అనంత్ గోయెంకా వరకు ఒక వరస ఉంది.. రాహుల్ గాంధీ విషయంలోనూ అదే తీరు.. మోతీలాల్ నెహ్రూ, జవహర్‌లాల్ నెహ్రూ.. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ నుంచి రాహుల్ గాంధీ.. ఇది మా కుటుంబం బాధ్యత అనుకుంటారు… వాళ్లు లాభనష్టాలు చూసుకోరు… మరో భాగానికి వస్తే మా నాన్న రైతు. నేను రైతు కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చాను. ఈ రెండు వర్గాల ప్రజల ఆలోచన విధానాలు వేర్వురుగా ఉంటాయి.. ఒకరిది బాధ్యతాయుత రాజకీయాలు.. మరొకరిది రాజకీయాల్లో రావాలనే ఆకాంక్ష.. కొత్త తరం వారికి త్వరగా కుర్చీలో కూర్చోవాలనే తాపత్రయం.. ఈ క్రమంలో లెక్కలు మారుతున్నాయి..
తెలంగాణ రైజింగ్… ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పించడం తెలంగాణ మోడల్… సుపరిపాలన తెలంగాణ మోడల్.. దాని అర్ధం… సంక్షేమం.. అభివృద్ధి.. కేవలం సంక్షేమం చేపడితే అభివృద్ధి ఉండదు.. కేవలం అభివృద్ధిపై దృష్టి పెడితే పేదలకు ఏం దక్కదు.. ఈ రెండింటిని సమతుల్యం చేయాలి.. అదే సుపరిపాలన.. దానిని దృష్టిలో పెట్టుకుంటున్నాం.. సోనియా గాంధీ 2023, సెప్టెంబరు 17న ఆరు గ్యారంటీలు ఇచ్చారు…దానికి అదనంగా నేను ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనే మరో గ్యారంటీ ఇచ్చాను. పదేళ్ల కేసీఆర్ హయాంలో పదిసార్లు సచివాలయానికి రాలేదు.. నేను పది నెలల్లో ప్రతి రోజు సచివాలయానికి వెళుతున్నా.. ప్రతిపక్షంలో ఉండి శాసనసభకు రావడం లేదు. పదేళ్ల కాలంలో ఎవరైనా ఇబ్బందులు ఉండి ధర్నా చేయాలనుకుంటే అలా చేయడానికి వీలు లేకుండా ధర్నా చౌక్‌ను మూసి వేశారు. పోలీసులను కాపాలా పెట్టారు… నేను ధర్నా చౌక్ ఓపెన్ చేశాను.. ఇప్పుడు హరీశ్ రావు, కేటీఆర్ ఆ ధర్నా చౌక్‌కు వస్తున్నారు. వాళ్లు వారానికి రెండు సార్లు వచ్చి కూర్చొంటున్నారు. వాళ్లకు ధర్నా చౌక్‌లో నేను స్థలం ఇచ్చాను. మేం ఎంత ప్రజాస్వామ్యయుతంగా ఉన్నామో చూడండి.. తెలంగాణ అప్రోచ్‌నే కాంగ్రెస్ అప్రోచ్.. తెలంగాణ రైజింగ్ కాంగ్రెస్ అప్రోచ్… 2004 నుంచి 2014 వరకు యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ.. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి.. నాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్నారు.. ఆయన గుజరాత్ మోడల్ కు ప్రచారం చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ఆటంకం కలిగించలేదు.. ఆయనకు అవసరమైన అనుమతులు, బడ్జెట్ ఇచ్చింది. కానీ ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలను విస్మరిస్తున్నారు… ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలను ఖతం చేసేందుకు ఆయన స్థాయిలో ప్రయత్నిస్తున్నారు… ఆయనది గుజరాత్ మోడల్.. ఇది తెలంగాణ మోడల్.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరైనా పెట్టుబడిదారు ప్రయత్నిస్తే గుజరాత్ వెళ్లమని ప్రధానమంత్రి కార్యాలయం చెబుతోంది..
సెమీ కండక్టర్‌ను చూడండి.. ఇన్‌సెంటివ్స్ ఎవరికి ఇచ్చారు..ఆయనది గుజరాత్ మోడల్.. ఆయన ప్రధానమంత్రి. కానీ ఆయన గుజరాత్‌కు ప్రధానమంత్రిలా భావిస్తున్నారు.. గుజరాత్‌కు ఇవ్వడానికి మాకు ఇబ్బంది లేదు.. అయిదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ అని ప్రధానమంత్రి మోదీ చెబుతున్నారు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర లేకుండా ఎలా అది సాధ్యం.. మహారాష్ట్ర నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థ ఉన్న రాష్ట్రం.. ఆర్థిక రాజధాని. రాజకీయంగా రెండో ప్లేస్‌లో ఉండవచ్చు… మహారాష్ట్ర నుంచి 17 భారీ పెట్టుబడులు గుజరాత్‌కు తరలించారు… ఈ విధానం సరైంది కాదు.. ప్రధానమంత్రి జడ్జిలా ఉండాలి.. ఒకరి తరఫున వకాల్తా పుచ్చుకోకూడదు. నేను ఫుట్‌బాల్ క్రీడాకారుడిని.. రిఫరీ ఒక జట్టు తరఫున ఆడకూడదు.. ఆయన గుజరాత్ తరఫున ఆడుతున్నారు.. ఇది దేశానికి మంచిది కాదు.. పెట్టుబడులకు వాతావరణం అనుకూలించాలి.. తెలంగాణ, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఫార్మాకు అనుకూలం.. ఐటీ, ఫార్మా పెట్టుబడులు పెట్టాలనుకునే వారు హైదరాబాద్ వైపు చూస్తారు. కానీ వారిని అహ్మదాబాద్ వెళ్లాలని ఒత్తిడి చేస్తే ఎలా..? ఇటువంటి సంకుచిత దృష్టి దేశానికి మంచిది కాదు… మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులకు మోదీ ఇద్దతు ఇస్తే ప్రతి రాష్ట్రం ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ తయారు చేయగలం… మేం ఆరు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సృష్టించగలం..అప్పుడు మోదీ పది ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను కలగనవచ్చు.. కానీ ఆయన గుజరాత్ గురించి మాత్రమే ఆలోచించడం సరికాదు..
మీ తాత ఎమర్జెన్సీకి, ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా పోరాడారు.. ఆయనకు ఒక పాయింట్ ఉంది.. కానీ దేశంపైనా అటువంటి అంకితభావం క్రమేణా తగ్గిపోతోంది..దేశంలో ప్రతి ఒక్కరికి ఆ అంకితభావం పెరిగేలా చూడాలి. అందుకే రీఓరియెంటేషన్ చేయాల్సిన అసవసరం ఉంది.. మన సిలబస్ మార్చాలి.. కంప్యూటర్ గురించి చదువు.. చదువు.. ఉద్యోగం వస్తుంది అంటున్నారు..ఎల్‌కేజీ నుంచి ఆ ఒత్తిడి ఉంటోంది. నా మనవడు 18 నెల ల వాడిని స్కూల్‌లో వేయాల్సి రావడం నాకు అశ్చర్యం.. ఈ విధానం మారాలి.. తల్లిదండ్రులు అంతగా దృష్టిపెడుతున్నారు… దానిని మార్చాలి.. స్వాతంత్య్రం రావడానికి కారకులు, మంచి చేసే వారిపై చర్చ సాగాలి. పార్లమెంట్‌లో చర్చకు వారు ముందుకు రావడం లేదు… ఈ దేశంలో 140 కోట్ల ప్రజలు కూడలిలో ఉన్నారు.. ఈ దేశంలో సిద్ధాంతపరమైన రాజకీయాలా..? స్విగ్గీ రాజకీయాలా..? కూటమి ప్రభుత్వాలా..? ప్రభుత్వం ఏర్పడితే చాలా.. ఎటు వెళ్లాలి అనేది తేల్చుకోలేకపోతున్నారు.. అయితే రీఓరియెంటేషన్ అవసరం.. తాత్కాలిక ఉపశమనం కోసం ప్రయత్నిస్తే.. దీర్ఘకాలిక ప్రయోజనాలు దక్కవు…’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.