నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ఇందిరమ్మ చీరల పంపిణీ, చేయూత పింఛన్ల విడుదలతో పాటు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వీరమాంబ అచ్చమ్మ వారసత్వం కలిగిన అచ్చంపేటను రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ స్ఫూర్తితో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, అంబేద్కర్ రాజ్యాంగం వల్లే యువతకు 18 ఏళ్లకు ఓటు హక్కు దక్కిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ ముందుచూపుతోనే రాష్ట్రంలో ప్రాజెక్టులు, విద్యాసంస్థలు ఏర్పడ్డాయని పేర్కొంటూ.. 50 ఏళ్ల క్రితం బీజేపీ గానీ, పాతికేళ్ల క్రితం బీఆర్ఎస్ గానీ లేవని అన్నారు. అధికారం కోల్పోతే బీజేపీ చచ్చిన పాము లాంటిదని విమర్శించారు.
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని రూ.8.50 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టి, ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి తెచ్చారని సీఎం మండిపడ్డారు. ప్రాజెక్టుల పేరుతో రూ.1.80 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు చూపినా, పాలమూరు ప్రాజెక్టులపై రూ.10 వేల కోట్లు కూడా ఖర్చు చేయకుండా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. కృష్ణా జలాల్లో పాలమూరుకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది, ఈ ప్రాంతమంతా కృష్ణా నీళ్లు పారిస్తానని స్పష్టం చేశారు. హరీశ్ రావు శాఖలు మారినా కమీషన్ల తీరు మారలేదని ఎద్దేవా చేశారు.
అధికారం కోల్పోయాక కేసీఆర్ ఫాంహౌస్‌కే పరిమితమై ఎత్తిపోతల పథకంలో ఉన్నారని సీఎం విమర్శించారు. గడిచిన 34 నెలల్లో రూ.2.50 కోట్ల జీతభత్యాలు తీసుకున్నప్పటికీ, చేసిన తప్పులకు ప్రజలకు మొహం చూపించలేకే కేసీఆర్ అసెంబ్లీకి గానీ, ప్రజల్లోకి గానీ రావడం లేదని, ఆయన్ని ఎలా శిక్షించాలో ప్రజలే నిర్ణయించాలన్నారు. తమ ప్రభుత్వం రైతుల కోసం రూ.1.78 లక్షల కోట్లు ఖర్చు చేసిందని, 25.35 లక్షల మందికి రూ.2 లక్షల రుణమాఫీ చేసి వరి సాగులో రికార్డు సృష్టించిందని తెలిపారు. ఇప్పటికే 75 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, త్వరలో మరో 25 వేల ఉద్యోగాలు, 2 వేల హోంగార్డు పోస్టులతో లక్ష ఉద్యోగాల హామీని పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.

