NTV Telugu Site icon

CM Revanth Reddy : ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేయాలని నిర్ణయించాం

Cm Revanth Reddy

Cm Revanth Reddy

తెలంగాణలో రైతు రుణమాఫీపై రాష్ట్రం కేబినెట్‌ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం భేటి అయ్యింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్ లో చెప్పినట్లు రూ.2లక్షల రుణమాఫీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 8నెలల్లోనే అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఐదు సంవత్సరాల మధ్య కాలంలో రాష్ట్రంలో రైతులు తీసుకున్న రుణాల్లో.. 2 లక్షల రూపాయల వరకు రుణామాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయం దండగ కాదు.. పండగలా అనుకునే విధంగా సాగు రంగాన్ని అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు. ఒకే విడతలో మొత్తం రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం రెండుసార్లు రూ.21వేల కోట్లు రుణమాఫీ చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం కటాఫ్ డేట్ 2018 డిసెంబర్ 11గా తీసుకుంది. అప్పటి నుంచి 2023 డిసెంబర్ 9 వరకు తీసుకున్న పంట రుణాలను మాఫీ చేస్తుందని సీఎం ప్రకటించారు.

 

2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 మధ్యకాలంలో తీసుకున్న పంట రుణాలను రూ.2లక్షల లోపు మాఫీ చేయనున్నారు. ఐదేళ్ల (2018 నుంచి 2023)లో తీసుకున్న క్రాఫ్ లోన్లను మాఫీ చేయడానికి రూ.31వేల కోట్లు అవసరమని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన రైతు డిక్లరేషన్‌లో హామీల అమలుపై చర్చించామని, రాహుల్‌ గాంధీ మాట ఇస్తే.. మడమ తిప్పని నాయకుడు అని ఆయన అన్నారు. తెలంగాణ ఇస్తామన్న హామీని సోనియా గాంధీ నిలబెట్టుకున్నారని, ఎన్ని సమస్యలు వచ్చినా, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. కాంగ్రెస్‌ మాట ఇస్తే వెనుకడుగు వేయదన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి.