NTV Telugu Site icon

CM Revanth Reddy: నీటిపారుదల శాఖ అధికారులతో సీఎం సమావేశం.. కీలక ఆదేశాలు

Cm Revanth Reddy

Cm Revanth Reddy

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (నీటి పారుద‌ల శాఖ‌) ఆదిత్యనాథ్ దాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం కీలక ఆదేశాలు ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ పైన పడే ప్రభావంపై ఐఐటీ హైదరాబాద్ టీంతో నివేదిక తయారు చేయించాల‌ని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. నెల రోజుల్లో సమగ్ర నివేదిక తయారు చేయాలని తెలిపారు. ఐఐటీ హైదరాబాద్ టీంతో కో ఆర్డినేషన్ కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. పోలవరం నిర్మాణంతో భద్రాచలం దేవాలయానికి ఏర్పడే ముప్పుపై సమగ్ర అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Read Also: Minister Seethakka: ముఖ్యమంత్రి మహిళల అభ్యున్నతి కోసం ఆలోచిస్తున్నారు..

2022లో 27 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినప్పుడు భద్రాచలం ముంపునకు గురైనట్లు సీఎం రేవంత్ రెడ్డికి అధికారులు వివరించారు. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా చేపట్టిన గోదావరి బన‌కచర్ల ప్రాజెక్టు అంశాన్ని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్ట్ పైన ఇటీవల ఏపీ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిందని తెలిపారు. వరద జలాల ఆధారంగా నిర్మిస్తున్న ఆ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని అధికారులు సీఎంకు తెలియ‌జేశారు. ఈ క్రమంలో.. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలంగాణ అభ్యంతరాలను తెలపాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుతో పాటు.. కేంద్ర జల్‌ శక్తి మంత్రిత్వ శాఖకు లేఖలు రాయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Read Also: Journalist Murder: అవినీతిని వెలికి తీసిన జర్నలిస్ట్ హత్య.. ముగ్గురి అరెస్ట్..

Show comments