CM K.Chandrashekar Rao: కరోనా సమయంలో గాంధీ ఆస్పత్రి వైద్యులు విశేష సేవలు అందించారని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. గాంధీ వైద్యులు కొవిడ్‌పై యుద్ధం చేశారన్నారు. కరోనా కాలంలో ధైర్యం పనిచేసిన వైద్యులు, ఆరోగ్య సిబ్బందిని, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావును ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. అహింస సిద్ధాంతంతో గాంధీజీ.. బ్రిటీష్‌వారిపై పోరాడి విజయం సాధించారని కొనియాడారు. గాంధీ సిద్ధాంతం ఎప్పటికైనా విశ్వజనీనమని ఆయన అన్నారు. గాంధీ మార్గంలో తెలంగాణ సాధించుకున్నామని ఆయన తెలిపారు. పల్లె, పట్టణ ప్రగతికి ప్రేరణ గాంధీయేనన్నారు. మహాత్ముడు జన్మించిన దేశంలో మనం పుట్టడం ఎంతో పుణ్యమన్నారు. ఆనాడు యావత్తు భారతాన్ని నడిపించిన సేనాని మహాత్మా గాంధీ.. ఏ కార్యక్రమం చేసినా అద్భుతమే, గొప్ప సందేశమే. గాంధీ ప్రతి మాట, పలుకు ఆచరణాత్మకమని సీఎం కేసీఆర్ అన్నారు. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో మహాత్ముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగించారు.
ఈ మధ్య కొందరు వేదాంత ధోరణిలో తన మాటలు ఉన్నాయని చాలామంది అడిగారని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రపంచంలో శాంతి ఉంటేనే మనమంతా సుఖంగా ఉంటామని కేసీఆర్ వెల్లడించారు. ఎన్ని ఆస్తులు ఉన్నా శాంతి లేకపోతే, జీవితం ఆటవికమేనన్నారు. సమాజాన్ని చీల్చే చిల్లర మల్లర ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ మధ్య మహాత్ముడినే కించపరిచే మాటలు వింటున్నామన్న సీఎం.. గాంధీని కించపరిచే మాటలు విన్నప్పుడు చాలా బాధ కలుగుతుందన్నారు. మహాత్ముని ఇమేజ్‌ను ఎవరూ దెబ్బతీయలేరని.. మరుగుజ్జులు ఏనాడు మహాత్ములు కాలేరన్నారు. దేశంలో ఏమి జరుగుతోందో ఆలోచించాలని కోరుతున్నానన్నారు. దేశం అంతా ఒక రకంగా జరుగుతుంటే.. తెలంగాణలో గాంధీని 15 రోజులు స్మరించుకున్నామన్నారు. తెలంగాణ కోసం తాను బయలుదేరినాడు తనను అవమానించేవారని సీఎం కేసీఆర్ తెలిపారు. ఉద్యమ సమయంలో తనను ఎవరైనా అవమానిస్తే గాంధీని గుర్తు చేసుకునేవాడినని ఆయన వివరించారు.
లాల్ బహదూర్ శాస్త్రి గారి పుట్టిన రోజు కూడా ఇవాళేనని ఆయన తెలిపారు. జై జవాన్, జై కిసాన్ నినాదాన్ని శాస్త్రి ఇచ్చారన్నారు. దేశంలో ఏమి జరుగుతోందో ఆలోచించాలని కోరుతున్నానన్నారు. చెడును ఖండించాలన్నారు. మౌనం పనికి రాదన్నారు.లాల్ బహదూర్ శాస్త్రి అన్న జై జవాన్ ఇప్పుడు అగ్నిపథ్‌లో నలిగిపోతోందని.. జై కిసాన్‌కు మద్దతు ధర లేక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని సీఎం కేసీఆర్ అన్నారు.
Mahatma Gandhi Statue: గాంధీ ఆస్పత్రిలో మహాత్ముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
ఎందరో మహనీయులు గాంధీ గొప్పదనాన్ని కొనియాడారన్నారు. మానవాళికి గొప్ప సందేశం, మార్గాన్ని చూపించిన గొప్ప వ్యక్తి.. మార్టిన్ లూథర్ వంటి వారు గాంధీ మార్గాన్ని అభినందించారని సీఎం కేసీఆర్ చెప్పారు. దలైలామా కూడా గాంధీ తనకు ఆదర్శం అని చెప్పారన్నారు. ప్రేమ, ఆప్యాయత ద్వారా అసహాయతను ఎదుర్కోవచ్చని చెప్పారు.. గాంధీజీని రవీంద్రనాథ్ ఠాగూర్ మహాత్ముడిగా సంబోధించారన్నారు. అహింసతో స్వరాజ్యం సాదిద్ధామని గాంధీజీ ప్రతిపాదించారన్నారు. అదే సమయంలో సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించారని కేసీఆర్ పేర్కొన్నారు. గాంధీ అహింస అన్నారు, మీరు మిలిటరీ స్థాపిస్తున్నారని బోస్‌ను విలేకరులు అడిగారన్నారు. అహింసా మార్గంలోనే స్వాతంత్ర్యం రావాలని కోరుకుంటున్నట్లు బోస్ చెప్పారు.. అహింసా మార్గంలో రాకపోతే సాయుధ పోరాటానికి సైన్యం సిద్ధం చేస్తున్నట్లు చెప్పారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.